Begin typing your search above and press return to search.

‘కబాలి’ అసలెలా మొదలైందంటే..

By:  Tupaki Desk   |   18 Jun 2016 7:00 AM GMT
‘కబాలి’ అసలెలా మొదలైందంటే..
X
కబాలి.. ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేస్తున్న పేరు. ఇంకో నాలుగు వారాల్లో విడుదల కాబోయే ఈ సినిమా కోసం రజినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే గత ఏడాది ఈ సమయానికి ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. అప్పటికి రజినీకాంత్.. పా రంజిత్ దర్శకత్వంలో నటిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే అతడిది రెండే రెండు సినిమాల అనుభవం. పైగా ఆ రెండు సినిమాలు కూడా వెరైటీగా ఉంటాయి. రజినీ-రంజిత్ కాంబినేషన్ గురించి ఎవ్వరూ ఊహించే పరిస్థితి లేదు. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా ఎలా చేశారు..? అందుకు కారణం ఎవరు..? అంటే రజినీ చిన్న కూతురు సౌందర్యనే అని చెప్పాలి. అసలు ‘కబాలి’కి ఎలా పునాది పడిందో ఆమె మాటల్లోనే విందాం పదండి.

‘‘నాకు రంజిత్.. వెంకట్ ప్రభు దగ్గర ‘గోవా’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుంచి తెలుసు. నిజానికి అతడి తొలి సినిమా ‘అట్టకత్తి’ని నేనే ప్రొడ్యూస్ చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఒక రోజు నాన్న నాకు ఫోన్ చేసి.. రంజిత్ ‘అట్టకత్తి’ తర్వాత చేసిన రెండో సినిమా ‘మద్రాస్’ సినిమా గురించి చెప్పాడు. అది తనకు ఎంతో నచ్చిందన్నాడు. అప్పుడే నాలో ఆలోచన మొదలైంది. ఆ తర్వాత రంజిత్ ను కలిసినపుడు మామూలుగా ఓ మాట అడిగాను. నాన్నగారితో సినిమా చేస్తారా అని. అతను షాకైపోయాడు. కొన్ని రోజుల తర్వాత నన్ను కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడు. మొదలుపెట్టడమే నాన్న ‘మలేషియా డాన్’ అని చెప్పగానే నేను పడిపోయాను. తర్వాత ఆ స్టోరీ లైన్ నాన్నకు చెప్పాను. ఆయనకూ నచ్చింది. అది రంజిత్ చెప్పిందని తర్వాత వెల్లడించాను. ఆపై చకచకా అన్నీ జరిగిపోయాయి. ఈ రోజు కబాలి మీ ముందుకు రాబోతోంది’’