Begin typing your search above and press return to search.

RX 100 వెనుక పెద్ద కథే ఉంది

By:  Tupaki Desk   |   24 May 2018 5:59 AM GMT
RX 100 వెనుక పెద్ద కథే ఉంది
X
కొన్ని సార్లు సినిమా తీయటం ఒక ఎత్తైతే దానికి పేరు సెట్ చేయటం మరో ఎత్తులా ఉంటుంది . ముఖ్యంగా ఒక బ్రాండ్ లేదా ఉత్పత్తి పేరుని సినిమాలో వాడుకోవాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకి గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టినప్పుడు షోలే నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే నిర్మాత బండ్ల గణేష్ పాతిక లక్షల దాకా రాయల్టీ చెల్లించి రూట్ క్లియర్ చేసుకోవడం ఫాన్స్ సులభంగా మర్చిపోయేది కాదు. ఓసారి మంచు మనోజ్ సినిమాకు మిస్టర్ నోకియా అని పెడితే కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో దాన్ని నూకయ్యగా మార్చాల్సి వచ్చింది. అలా చేయటం సినిమా ఫలితం మీద కూడా కొంత ప్రభావం చూపింది. అందుకే దర్శక నిర్మాతలు ఒకటిరెండు సార్లు జాగ్రత్త వహించాల్సి వస్తోంది. తాజగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన RX 100 టైటిల్ వెనుక కూడా ఇంత కన్నా పెద్ద కసరత్తే ఉందట.

RX 100 అనేది జపాన్ కు చెందిన యమహా బ్రాండ్ లో ఒక సుప్రసిద్ధ బైక్ మోడల్. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఇది ట్రెండీగా యూత్ అంతా వాడిన ఎవర్ గ్రీన్ పీస్. అప్పటి కుర్రకారు దీన్ని స్టేటస్ సింబల్ గా కూడా వాడేవాళ్లు. అంతెందుకు చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతామో అంతకు పదింతలు ఈ బైక్ ఉన్నవాళ్లు కాలర్ ఎగరేసేవాళ్ళు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టాలి అనుకున్నప్పుడు చట్టపరమైన చిక్కులు వస్తాయేమో అని భావించిన నిర్మాత వేరేది చూడమని చెప్పినా దర్శకుడు అజయ్ భూపతి వినకుండా కథకు ఇది కీలకమని చెప్పడం తో చెన్నై మార్కెయింగ్ హెడ్ ద్వారా జపాన్ లోని యమహా హెడ్ క్వార్టర్స్ ని సంప్రదించి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది. మోడల్ వరకు ఓకే కానీ యమహా పేరుని మాత్రం వాడకండి అని చెప్పడంతో ఇదే చాలు అని సర్దుకున్నారు. ఒక్క పేరు కోసమే ఇంతగా తాపత్రయపడిన అజయ్ సినిమా కోసం ఏమేం చేసుంటాడా అనే అంచనాలు ట్రైలర్ తోనే మొదలయ్యాయి. తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించే రా నేటివిటీని దీనిలో సృష్టించిన అజయ్ భూపతి కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతని నమ్మకం నిజమయ్యేలా ఉంది. వారంలోపే మిలియన్ వ్యూస్ కి చేరువ కావడం కన్నా సాక్ష్యం ఇంకేం కావాలి