Begin typing your search above and press return to search.

తెలుగు నటుడికి జపాన్‌ లో మరీ ఇంత క్రేజా?

By:  Tupaki Desk   |   2 March 2019 11:18 AM GMT
తెలుగు నటుడికి జపాన్‌ లో మరీ ఇంత క్రేజా?
X
తెలుగు సినిమా స్థాయిని 'బాహుబలి' చిత్రం హాలీవుడ్‌ రేంజ్‌ కు తీసుకు వెళ్లింది. ఏ ఇండియన్‌ సినిమాకు కూడా సాధ్యం కాని వసూళ్లను కొన్ని ఏరియాల్లో, కొన్ని దేశాల్లో ఈ చిత్రం రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం జపాన్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 'బాహుబలి 2' చిత్రం జపాన్‌ ఆడియన్స్‌ కు విపరీతంగా నచ్చింది. ఏ సినిమా అయినా హిట్‌ అయితే అక్కడ ప్రేక్షకులు హీరో, హీరోయిన్‌, దర్శకుడిని అభిమానిస్తారు. కాని జపనీస్‌ మాత్రం హీరో, హీరోయిన్‌ కంటే కాస్త ఎక్కువ మోతాదులోనే బాహుబలి చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించిన సుబ్బరాజును అభిమానిస్తున్నారు.

ఆమద్య ఒకసారి సుబ్బరాజు జపాన్‌ వెళ్లిన సమయంలో ఆయనకు దక్కిన ఆధరణ అంతా ఇంతా కాదు. కుమార వర్మ అనే కామెడీ పాత్రను పోషించిన సుబ్బరాజుకు జపాన్‌ లో అంత క్రేజ్‌ ఏంటా అంతా ఆశ్చర్య పోయారు. బాహుబలి సినిమాలో కుమార వర్మ పాత్ర మొదట పిరికి పందగా కమెడియన్‌ తరహాలో ఉంటుంది. ఆ తర్వాత బాహుబలి ధైర్యం నూరి పోయడంతో ధైర్యవంతుడు అవుతాడు. మొత్తంగా సినిమాలో కుమార వర్మ పాత్ర కనిపించేది కొద్ది సమయమే అయినా జపాన్‌ వారికి బాగా కనెక్ట్‌ అయినట్లుగా ఉంది. అందుకే అక్కడి వారు సుబ్బరాజుకు బ్రహ్మరథం పడుతున్నారు.

తాజాగా సుబ్బరాజు పుట్టిన రోజు జరుపుకున్నాడు. సుబ్బరాజు పుట్టిన రోజు సందర్బంగా జపాన్‌ లో కొందరు జపనీస్‌ కేక్‌ కట్‌ చేయడంతో పాటు, ప్రత్యేకంగా సుబ్బరాజుకు కానుకలు కూడా పంపించారు. సుబ్బరాజు బర్త్‌ డే సందర్బంగా కేక్‌ కట్‌ చేసి వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ఆ వీడియోను సుబ్బరాజు షేర్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. మొత్తానికి సుబ్బరాజుకు జపాన్‌ లో మరీ ఇంత క్రేజ్‌ ఉండటం ఏంటా అంటూ సినీ వర్గాల వారు కూడా నోరె వెళ్లబెడుతున్నారు. జపాన్‌ లో ఇంత ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సుబ్బరాజు మెల్లగా జపనీస్‌ సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుందనే కామెంట్స్‌ ను కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్నారు.