Begin typing your search above and press return to search.
సేల్ కోసం పాత డైలాగులకి పాలిష్!
By: Tupaki Desk | 24 Aug 2015 4:51 AM GMTపంచ్ లు, ప్రాసలతో పవర్ ఫుల్ డైలాగులు రాయగల దర్శకుడిగా హరీష్ శంకర్ కి పేరుంది. `సుబ్రమణ్యం ఫర్ సేల్`లో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ తరహాలో హరీష్ శంకర్ సంచుల కొద్దీ పంచ్ లు రాసుకోగలడు. అయితే ఎక్కువగా క్యారెక్టర్ ని, ఆ హీరో స్టైల్ నీ బేస్ చేసుకొని డైలాగులు వేస్తుంటాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో సినిమా తీస్తున్నాడనేసరికి ఇందులో మళ్లీ హరీష్ శంకర్ పదునైన సంభాషణలు వినిపిస్తాడని ప్రేక్షకులు అంచనాలు వేసుకొన్నారు. ఆ అంచనాలకి తగ్గట్టుగానే `సుబ్రమణ్యం ఫర్ సేల్`లో డైలాగులు వినిపించే ప్రయత్నం చేశాడు. కథకి, సన్నివేశాలకి సెట్టయితే అవ్వొచ్చేమో కానీ... అవన్నీ పాత డైలాగులకి పాలిష్ చేసి కొత్తగా వాడినట్టు అనిపిస్తున్నాయి.
`నాకో తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది...`, `నా తిక్కేంటో చూపిస్తా, నీ లెక్కేంటో తెలుస్తా...` అంటూ `గబ్బర్ సింగ్`లో పవన్ కళ్యాణ్ కోసం డైలాగులు రాశాడు హరీష్ శంకర్. `సుబ్రమణ్యం ఫర్ సేల్` కోసం అదే డైలాగుని కాస్త పాలిష్ చేసి `అందరూ లెక్కలు రాసుకొంటారేమో.. నేను తేల్చుకొంటా` అని రాసి వినిపించాడు. అలాగే `సన్నాఫ్ సత్యమూర్తి`కోసం త్రివిక్రమ్ రాసిన `భార్య నచ్చితెచ్చుకొనే బాధ్యత... పిల్లలు మోయాలనిపించే బరువు` డైలాగ్ ని హరీష్ శంకర్ కామెడీగా మార్చేసి `బాటిల్ మోయాలనిపించే బరువు... మందు తాగాలనిపించే బాధ్యత` అంటూ బ్రహ్మానందంతో చెప్పించాడు. ట్రైలర్ లో చివరిగా సాయిధరమ్ తేజ్ చెప్పిన `మాటలతో మాయ చేయగలను. సంచుల కొద్దీ పంచ్ లు వేయగలను. కానీ టార్గెట్ పంచ్ వేయడం కాదు... పనిచేయడం` అని చెప్పాడు. ఆ డైలాగ్ తో హరీష్ శంకర్ చెప్పినట్టుగా అనిపించిన నీతి ఏమిటంటే... పంచ్ లు ఎన్నైనా రాసుకోవచ్చు కానీ... వాటిని పనినిబట్టి వాడాల్సి, సన్నివేశాల్ని బట్టే వాడాలి అని! మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే పంచ్ లు, ప్రాసలకంటే కథకి, క్యారెక్టరైజేషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.