Begin typing your search above and press return to search.

రివైండ్‌ 2015: కొత్త ద‌ర్శ‌కులొచ్చారోచ్‌

By:  Tupaki Desk   |   15 Dec 2015 5:30 PM GMT
రివైండ్‌ 2015: కొత్త ద‌ర్శ‌కులొచ్చారోచ్‌
X
ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌లోకి కొత్త ర‌క్తం వ‌స్తూనే ఉంది. ప్ర‌తి యేడాది లానే 2015లో కూడా చాలా మంది యువ ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం అయ్యారు. అలా వ‌చ్చిన ఓ డ‌జ‌ను డైరెక్ట‌ర్ల‌లో ఎవ‌రు విజ‌యం సాధించారు? ఎవరి స్టాట‌స్ ఏంటి? అన్న‌దే ఈ రివ్యూ.

ఏడాది ఆరంభ‌మే ప‌టాస్ మూవీతో హిట్ కొట్టాడు అనీల్ రావిపూడి. ర‌చ‌యిత‌గా కెరీర్ ప్రారంభించి క‌ళ్యాణ్‌ రామ్ అవ‌కాశం ఇవ్వ‌డంతో ద‌ర్శ‌కుడ‌య్యాడు. తొలి సినిమానే బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి దిల్‌ రాజు సంస్థ‌లో ఛాన్స్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా సుప్రీమ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక గోపిచంద్ హీరోగా జిల్ సినిమాతో హిట్ కొట్టాడు రాధాకృష్ణ‌. విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ స‌ర్కిల్ష్‌ లో పాపుల‌ర్ అయ్యాడు. అలాగే నాని హీరోగా కంబ్యాక్ సినిమా ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు నాగ్ అశ్విన్‌. ఆ సినిమా సెట్స్‌ లోనే నిర్మాత ప్రియాంక ద‌త్‌ ని ప్రేమించి ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నారా రోహిత్ హీరోగా కృష్ణ విజ‌య్ అసుర చిత్రాన్ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. పోలీస్ క‌థే అయినా కిక్కిచ్చేలా తీశాడ‌న్న పేరొచ్చింది.

ఇక నిఖిల్ హీరోగా సూర్య వ‌ర్సెస్ సూర్య‌ లాంటి డిఫ‌రెంట్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా కార్తీక్‌ కి చ‌క్క‌ని గుర్తింపు వ‌చ్చింది. అలాగే క‌మ‌ల్‌హాస‌న్ చీక‌టి రాజ్యం మూవీతో మంచి విజ‌యం అందుకున్నాడు రాజేష్ .ఎం. సెల్వ‌. అలాగే ఏడాది చివ‌రిలో త‌ను నేను అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన నిర్మాత రామ్మోహ‌న్ తొలి ప్ర‌య‌త్నం తోనే ఆక‌ట్టుకున్నారు. అభిరుచి ఉన్న సినిమా తీశార‌ని మెప్పు పొందారు.

ల‌య‌న్ సినిమాతో స‌త్య‌దేవా - కొరియ‌ర్ బోయ్ క‌ళ్యాణ్ సినిమాతో ప్రేమ్ సాయి - శివ‌మ్ సినిమాతో శ్రీ‌నివాస్‌ రెడ్డి - శంక‌రాభ‌ర‌ణం సినిమాతో ఉద‌య్ నంద‌వ‌నం ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అయ్యారు. కానీ ఈ సినిమాలేవీ విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఐడెంటిటీ కోల్పోవాల్సొచ్చింది. ప్ర‌స్తుతం వీళ్లంతా రెండో సినిమా కోసం ఎటెంప్ట్ చేస్తూనే ఉన్నారు. హిట్టొచ్చిన‌వాళ్ల‌కు వెంట‌నే అవ‌కాశాలిచ్చే ప‌రిశ్ర‌మ‌లో కాస్త క‌ష్ట‌మే అయినా ప్ర‌య‌త్నించి రెండో ప్ర‌య‌త్నంలో అయినా గెలుపు సాధించాల‌ని ఆశిద్దాం.