Begin typing your search above and press return to search.

ఇవి సక్సెస్ మీట్లా ఫెయిల్యూర్ మీట్లా..?

By:  Tupaki Desk   |   2 Aug 2018 1:30 AM GMT
ఇవి సక్సెస్ మీట్లా ఫెయిల్యూర్ మీట్లా..?
X
ఓ ఏడాదిలో ఎన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయో.. వాటిలో ఎన్ని హిట్టవుతాయో ఎన్ని ఫట్టంటాయో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. ఓన్లీ టెన్ పర్సెంట్.. లెస్ దేన్ 10% సక్సెస్ రేట్. కానీ మన ఫిలిం మేకర్స్ ఏర్పాటు చేసే సక్సెస్ మీట్ ల పర్సెంటేజ్ ఎంతో చెప్పండి? షుమారుగా 90 %..!

ఇది ఎవరో ఒక్క నిర్మాత లేదా దర్శకుడు చేశాడని ఎత్తి చూపడం కాదు కానీ అసలు సక్సెస్ మీట్ అరేంజ్ చేసే ముందు ఒక్కసారైనా వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే హిట్ అయిన సినిమా ఏంటో ఫ్లాపయిన సినిమా ఏంటో ప్రతి ఒక్కరికీ తెలిసినప్పుడూ ఇక ఈ హంగామా అంతా ఎందుకు? అదే 'సక్సెస్ మీట్' పేరుకి బదులు ప్రమోషనల్ ఈవెంట్ అనో లేదంటే థ్యాంక్స్ మీట్ అనో మరో పేరు పెట్టుకుంటే కనీసం ప్రేక్షకులు నవ్వుకోరు. అసలే ఈమధ్య తెలుగు సినిమాలో కామెడి డోస్ దగ్గి లిప్పులాకుల డోస్ పెరుగుతోంది కదా. అందుకే ఇలా 'సక్సెస్ మీట్' ల పేరుతో కామెడీ ప్రేక్షకులకు కామెడీ పంచాలనుకుంటే మాత్రం ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఫ్లాప్ అయిన సినిమాకు సెంటు, అత్తరు కొట్టి హిట్టయిందని చెప్తే ఎవరిని మోసం చేయాలని అనుకుంటారో ఏమో గానీ అది వాళ్ళను వాళ్ళే మోసం చేసుకున్నట్టే.

గతంలో ప్రతి సినిమాకు రిలీజ్ అయిన మరుసటి రోజునుండే హిట్ - సూపర్ హిట్ - బంపర్ హిట్ - బ్లాక్ బస్టర్ అని పోస్టర్లు వేసేవారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా వేస్తున్నారు లెండి. ఆ పిచ్చి ముదిరి ఎంత దూరం వెళ్లిందంటే.. ఈమధ్య ఒక నిజమైన బ్లాక్ బస్టర్ వస్తే వాళ్ళు ఆ 'బ్లాక్ బస్టర్' పదాన్ని వాడడానికి ఇబ్బంది అనిపించి 'రియల్ బ్లాక్ బస్టర్' .. 'జెన్యూన్ బ్లాక్ బస్టర్' అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది మీకు నాన్నా పులి లాంటి స్టొరీని గుర్తు చేస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

సక్సెస్ అయిన సినిమాకు సక్సెస్ మీట్ మెట్టాలి. అలా కాకుండా ప్రతి జఫ్ఫా సినిమాకు సక్సెస్ మీట్ పెడితే రేపు నిజంగా ఎవరికైనా ఒక సక్సెస్ వస్తే ఆ మేకర్స్ 'బ్లాక్ బస్టర్' లా 'సక్సెస్ మీట్' పదాన్ని వాడేందుకు సిగ్గుపడి 'రియల్ సక్సెస్ మీట్'.. 'జెన్యూన్ సక్సెస్ మీట్' అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

ఇప్పుడు జరుగుతున్న సక్సెస్ మీట్లలో 90% 'ఫెయిల్యూర్ మీట్స్'.. అర్థం కాలేదా. ఓ ఆవారా స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆరోజు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకుంటాడు. అదేదో ఘనకార్యంలా ఫ్రెండ్స్ దగ్గర పోజు కొడతాడు. మన సక్సెస్ మీట్లు కూడా కూడా అలానే ఉన్నాయి. మన ఫిలిం మేకర్స్ ఎప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటారో ఏంటో!