Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' విషయంలో అలాంటి ఆలోచన తప్పు!

By:  Tupaki Desk   |   27 March 2022 11:31 AM GMT
ఆర్ ఆర్ ఆర్ విషయంలో అలాంటి ఆలోచన తప్పు!
X
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించిన చర్చలే కనిపిస్తున్నాయి. అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, అదే జోరును కొనసాగిస్తోంది. వెండి తెరను భారీస్థాయిలో ఆక్రమించిన ఈ సినిమాకి కథను అందించినది విజయేంద్ర ప్రసాద్. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడారు.

'బాహుబలి' సినిమా సమయంలో ఇద్దరు హీరోలతో ఒక సినిమా చేద్దామని రాజమౌళి అన్నాడు. రజనీ - కమల్, సూర్య - కార్తి, చరణ్ - అల్లు అర్జున్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయని ఆలోచన చేశాము. ఈ సినిమా చేయడానికి రెండేళ్లు పట్టొచ్చు. అందువలన ఇద్దరు హీరోలలో వాళ్లలో వాళ్లకి ర్యాపో ఉండాలి .. వాళ్లతో నాకు ర్యాపో ఉండాలి. అప్పుడైతే అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తుంది అని రాజమౌళి నాతో అన్నాడు. ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేయడం వలన ఆయనతో నాకు మంచి ర్యాపో ఉంది. చరణ్ తో ఒక సినిమానే చేసినప్పటికీ ఆయనతోను నాకు మంచి సాన్నిహిత్యమే ఉందని అన్నాడు.

ఇక ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. అందువలన వాళ్లిద్దరితో అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని రాజమౌళి వ్యక్తం చేశాడు. అప్పుడు ఈ సినిమాకి లైన్ అనుకోవడం జరిగింది. ఈ సినిమాను చేయడానికి ఎన్టీఆర్ - చరణ్ ఒప్పుకున్నారు. అప్పుడు మేము ఇతణ్ణి హైలైట్ చేయాలని .. అతణ్ణి హైలైట్ చేయాలని అనుకోలేదు. తెరపై సమానమైన ఫ్రేమ్స్ లో వాళ్లు కనిపించేలా చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే రాజమౌళి కథను నమ్మాడు. ఎన్టీఆర్ - చరణ్ కథతో పాటు రాజమౌళిని నమ్మారు.

ఎన్టీఆర్ - చరణ్ పేర్లు ఎండ్ టైటిల్స్ లో పడతాయి. దీనిని బట్టి ఎలాంటి వాతావరణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లిందనేది అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అంటున్నారు .. ఒక పాత్రను ఎక్కువ చేసి .. మరో పాత్రను తక్కువ చేశారని.

అలాంటి ఆలోచనే తప్పు .. నిజానికి అలా చేస్తే సినిమా దెబ్బతింటుంది.

తెరపై ఒకసారి చరణ్ పాత్ర డామినేట్ చేయవచ్చు. మరోసారి ఎన్టీఆర్ పాత్ర డామినేట్ చేయవచ్చు. టోటల్ గా కథకి న్యాయం చేయడమే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఇక ఈ సినిమాకి తొలి ఆటకే డివైడ్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఇంతకుముందు కూడా అలా జరిగింది. ఆ తరువాత హిట్ టాక్ వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.