Begin typing your search above and press return to search.

వర్మ సెన్సేషనల్ మూవీలో హీరో అతనేనా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 11:12 PM IST
వర్మ సెన్సేషనల్ మూవీలో హీరో అతనేనా?
X
తనకు ఏదైనా ఆలోచన తట్టడం ఆలస్యం.. సినిమాను అనౌన్స్ చేసేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. దీని గురించి చర్చ జరుగుతుండగానే నెలా రెండు నెలల్లో సినిమా పూర్తి చేసి ఫస్ట్ కాపీ తీసేయగల ఘనుడు వర్మ. ఈ మధ్య ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాను అలాగే పూర్తి చేసేశాడు. ఇంకా వర్మ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులుండగానే.. ఈ మధ్య బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో ఓ సినిమా తీస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అండర్ వరల్డ్ డడాన్ ముతప్ప రాయ్ జీవితం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు ‘అప్పా’ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు వర్మ. ఫాదర్ ఆఫ్ ఆల్ గాడ్ ఫాదర్స్ అనే ట్యాగ్ లైన్ కూడా ప్రకటించాడు.

ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా వర్మ ఓ అవగాహనకు వచ్చేసినట్లు సమాచారం. అతను మరెవవరో కాదు.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్. రాజమౌళి ‘ఈగ’తో సుదీప్ ను విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ముందే అతడితో పని చేశాడు వర్మ. హిందీ హార్రర్ మూవీ ‘ఫూంక్’లో అతనే హీరో. రక్త చరిత్రలో కూడా ఓ కీలకమైన పాత్ర చేశాడు. ఐతే అప్పటికి మనకు పరిచయం లేదు కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతడికి మంచి పాపులారిటీ ఉంది. మాఫియా డాన్ క్యారెక్టర్ కు సుదీప్ సూపర్ గా సెట్టవుతాడనడంలో సందేహం లేదు. మాఫియా సినిమాలు తీయడంలో వర్మ స్టైలే వేరు కాబట్టి సర్కార్, కంపెనీ సినిమాల స్థాయిలో ‘అప్పా’ ఉండొచ్చని అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. గత కొన్నేళ్లుగా మొక్కుబడిగా సినిమాలు చుట్టేస్తున్నట్లు కాకుండా వర్మ కొంచెం శ్రద్ధ పెట్టి తీశాడంటే ‘అప్పా’ కచ్చితంగా సెన్సేషనల్ అవుతుంది.