Begin typing your search above and press return to search.

వెంకీకి ఆమె మీద నమ్మకం లేనట్లేగా?

By:  Tupaki Desk   |   4 April 2017 11:18 AM GMT
వెంకీకి ఆమె మీద నమ్మకం లేనట్లేగా?
X
‘గురు’ సినిమా తమిళ-హిందీ భాషల్లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుదు సుట్రు/సాలా ఖడూస్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ముందు ఈ కథ మన విక్టరీ వెంకటేష్ దగ్గరికే వచ్చిందన్న సంగతి ఈ మధ్యే వెల్లడైంది. అంతకంటే ముందు రానాకు సైతం సుధ కొంగర ఈ కథ వినిపించిందట. ఐతే రానా ఎందుకు దీన్ని కాదన్నాడో సుధ చెప్పలేదు కానీ.. వెంకీ మాత్రం అనారోగ్యం కారణంగా అప్పుడు సినిమా చేయలేకపోయినట్లు తెలిపింది సుధ. ఇంతకీ వెంకీ అంత అనారోగ్యం ఏమొచ్చింది అంటే.. ఆయన అప్పుడు డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడట. అందుకే సినిమా చేయలేకపోయాడట. ఐతే కేవలం డెంగీ జ్వరంతో సినిమా వదిలేసి ఉంటాడా అంటే ఆశ్చర్యమే. నిజంగా కథ నచ్చి.. సుధ మీద నమ్మకం ఉండి ఉంటే.. కొన్ని రోజులు ఆగి ఆ సినిమా చేసి ఉండొచ్చు కదా. దీన్ని బట్టి చూస్తే అప్పటికి ఆమె మీద వెంకీకి నమ్మకం లేదనే అనుకోవాలి.

‘గురు’ కథ చెప్పే సమయానికి సుధ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. తెలుగులో అంతకుముందు ఆమె ‘ఆంధ్రా అందగాడు’ అనే ఊరూ పేరు లేని సినమా చేసింది. ఆ తర్వాత తమిళంలో తీసిన ‘ద్రోహి’ కూడా యావరేజ్ అనిపించుకుందంతే. ఐతే ‘గురు’ కోసం మాత్రం ఆమె మామూలు కష్టం పడలేదు. మూడేళ్ల పాటు ఎందరో బాక్సర్లను కోచ్ లను కలిసి.. బాక్సింగ్ సంఘాల్ని స్టడీ చేసి ఈ స్క్రిప్టు రెడీ చేసింది. మూడేళ్లు ఈ కథ కోసం పని చేసిన ఆమె.. వెంకీ కొన్ని నెలల పాటు వెయిట్ చేయమని ఉంటే కాదని ఉండేది కాదేమో. అందుకే డెంగీ జ్వరం కాబట్టి అప్పుడు సినిమా చేయలేకపోయానని వెంకీ అనడంలో ఎంత వరకు నిజం ఉందన్నది సందేహమే. ఐతే తమిళంలో ‘ఇరుదు సుట్రు’ చూశాక మాత్రం ఇప్పుడు నాతో సినిమా చెయ్ అని వెంకీ చెప్పినట్లు సుధ తెలిపింది. అంటే తమిళంలో ప్రూవ్ చేసుకున్నాక కానీ వెంకీకి ఆమె మీద గురి కుదరలేదన్నమాట. ఏదైతేనేం.. తమిళంలో మాదిరే తెలుగులోనూ సినిమా హిట్టయింది కాబట్టి ఇప్పుడు నో వర్రీస్.. ఆల్ హ్యాపీస్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/