Begin typing your search above and press return to search.

అలా అయితే కృతి శెట్టి మరో సావిత్రినే!

By:  Tupaki Desk   |   2 Jan 2022 3:44 AM GMT
అలా అయితే కృతి శెట్టి మరో సావిత్రినే!
X
సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్లో ఇంతకుముందు 'సమ్మోహనం' .. 'వి' సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా ఇద్దరూ కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేశారు. మైత్రీ మూవీస్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. ఫస్టు లుక్ లాంచ్ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ .. "ఆ అమ్మాయి గురించి చెప్పడానికి ముందుగా దర్శకుడు ఇంద్రగంటి గురించి మీకు చెప్పాలి. ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నానని ఇలా చెప్పడం లేదు .. ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరు.

ఏ హీరోయిన్ తో నేను మూడు సినిమాలు చేయలేదు .. కానీ ఆయనతో మూడు సినిమాలు చేశాను. ఇతర హీరోలకంటే ఆయనతో నాకున్న కెమిస్ట్రీ ఎక్కువని నేను ఫీలవుతున్నాను. ఎంతో క్వాలిటీ సినిమాలను అందించే ఆయనతో మూడు సినిమాలు చేయడం గొప్ప విషయంగానే భావిస్తున్నాను. ఈ సినిమాలో మీరు భూతద్దం పెట్టి చూసినా ఒక్క కామెంట్ కూడా చేయలేరు. ఆ విషయాన్ని మాత్రం నేను పక్కాగా చెబుతాను. బెంచ్ మార్క్ స్టూడియోస్ వారికి ఇది ఫస్టు సినిమా. ఎక్కడా ఎలాంటి తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ను తయారు చేశారు.

ఎంత మంచి రాకెట్ తయారు చేసినా దానికి మంచి ఫ్యూయల్ కావాలి .. ఆ ఫ్యూయల్ మైత్రీ వారే. వాళ్లు హిట్స్ ఇస్తూ వస్తున్న సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఉంటుందని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఈ సినిమాకి చాలావరకూ 'సమ్మోహం' టీమ్ పనిచేసింది. ఆ సినిమా కంటే బెస్ట్ అవుట్ పుట్ ను ఇవ్వగలిగింది. వివేక్ సాగర్ గారు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు .. ఆయన చేసిన ఐటమ్ సాంగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ అమ్మాయి గురించి సినిమాలో ఏం చెప్పాననేది ఇప్పుడు చెప్పనుగానీ, ఆఫ్ స్క్రీన్ చెబుతాను.

కృతి శెట్టిని మీరు 'ఉప్పెన'లో ఒకలా చూసి ఉంటారు. కానీ ఈ సినిమాలో ఆమెను మీరు చాలా డిఫరెంట్ గా చూస్తారు. ఆమె ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది .. దానిని బట్టే ఆమె ఈ సినిమాలో కొత్తగా కనిస్తుందనే విషయం జనంలోకి వెళ్లింది. సావిత్రి గారి బయోపిక్ చూసినప్పుడు ఈ కంట్లో కొద్దిగా నీళ్లు రావాలి .. ఆ కంట్లో కొద్దిగా నీళ్లు రావాలని అంటే .. అలా ఎల్లా జరుగుతుంది .. అంతా సుత్తి అనుకున్నాను. కానీ అలాగే కృతి శెట్టి గ్లిజరిన్ లేకుండా చేసింది. ఎలా చేయగలుతున్నారు అని ఆడితే చెప్పకుండా దాటేసింది.

ఈ సినిమాను నేను 'సమ్మోహనం'తో పోలుస్తూ మాట్లాడతాను .. ఎందుకంటే ఆ సినిమా మాదిరిగానే ఇది కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ కనుక. 'సమ్మోహనం'లో నేను సినిమాలంటే ఇష్టం లేని ఒక పాత్రలో కనిపించాను. కానీ ఇందులో నేను సినిమాలు చేసే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. 'సమ్మోహనం'లో నేను చేసిన పాత్రకి పూర్తి భిన్నంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో బిగ్గర్ స్టోరీ .. లార్జర్ ఎమోషన్స్ .. మోర్ ఫన్ ఉంటాయి. 'సమ్మోహనం' నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి గనుక అప్పుడు మాట్లాడుకుందాం" అంటూ ముగించాడు.

తెలుగు తెరపై గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు పెట్టుకున్న నటీమణులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కన్నాంబ అయితే మరొకరు సావిత్రి. మళ్లీ ఇంతకాలానికి కృతి శెట్టి వచ్చేసిందన్న మాట. మూడో సినిమాకే కృతి శెట్టి ఇలాంటి ప్రశంసలను అందుకోవడం విశేషమనే అనుకోవాలి మరి.