Begin typing your search above and press return to search.

ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఐదు

By:  Tupaki Desk   |   4 Nov 2017 4:35 AM GMT
ఒకటి రెండూ కాదు.. ఏకంగా ఐదు
X
సూపర్ స్టార్ కుటుంబ సభ్యుడనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుధీర్ బాబు. ప్రేమ కథా చిత్రమ్ తో హిట్ సొంతం చేసుకున్నాడు. సోలో హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తూనే మల్టీస్టారర్ మూవీగా వచ్చిన శమంతకమణిలోనూ నటించాడు. బాలీవుడ్ సినిమా బాఘీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు ఒకటి రెండు కాదు.. ఏకంగా అయిదు సినిమాలు చేస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో రెండు పూర్తి కావచ్చాయని కూడా చెప్పాడు.

జెంటిల్‌మెన్ - అమీతుమీ చిత్రాలతో మెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబు హీరోగా సినిమా చేయనున్నాడు. మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియాలో నటించిన బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరీ ఇందులో హీరోయిన్. ఇంద్రగంటితో ‘జెంటిల్‌మెన్‌’ మూవీ నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌ దీనికి కూడా ప్రొడ్యూసర్. యాక్టర్ అండ్ రైటర్ హర్షవర్థన్‌ డైరెక్షన్లో అమెరికా నేపథ్యంలో ఓ లవ్‌ థ్రిల్లర్‌ చేయబోతున్నాడు. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఫాదర్‌ సెంటిమెంట్‌తో రాజశేఖర్ అనే కొత్త డైరెక్టర్ తో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. దీనిని సుధీర్ బాబే స్వయంగా నిర్మించనున్నాడు. ఇంద్రసేన అనే ఇంకో కొత్త డైరెక్టర్ తో ఓ సోషల్ థ్రిల్లర్ పిక్చర్ చేయనున్నాడు. ఇంకో సినిమా అందరికీ తెలుసంటూ మాట దాటేశాడు. అయితే అది గరుడవేగ ఫేం ప్రవీ ణ్‌ సత్తారు డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ కావచ్చని అంచనా.

సుధీర్ బాబు చేయనున్నట్లుగా అనౌన్స్ చేసిన ఐదు కొత్త సినిమాల్లో రెండింటికి కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నాడు. ఇందులో రెండు ద్విభాషా చిత్రాలు కావడం విశేషం. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రావడమే కనాకష్టంగా ఉంటే సుధీర్ బాబు మాత్రం ఏకంగా ఐదు మూవీస్ చేసేస్తానంటున్నాడు. వీటిలో ఎన్ని తెరముందుకొస్తాయో..