Begin typing your search above and press return to search.

ఖాకీ డ్రెస్ ఈ సారైనా కలిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   13 Feb 2022 3:06 PM IST
ఖాకీ డ్రెస్ ఈ సారైనా కలిసొచ్చేనా?
X
సుధీర్ బాబు హీరోగా ఇండస్ట్రీలోకి కాలుపెట్టేసి రీసెంట్ గా పదేళ్లను పూర్తిచేసుకున్నాడు. ఈ పదేళ్లలో ఆయన తనకి నచ్చిన కథలను .. పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతున్నాడు. అడపా దడపా పలకరించే హిట్లతో ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ కెరియర్ ను నడిపిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' విడుదలకు ముస్తాబవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. ఇంద్రగంటితో సుధీర్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది.

ఈ సినిమా తరువాత సుధీర్ బాబు ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా నిన్ననే వదిలారు. మెషిన్ గన్స్ తో కూడిన ఈ పోస్టర్ ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

మహేశ్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, సుధీర్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే ఖాకీ డ్రెస్ వేయడం ఆయనకి ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు 'వీరభోగ వసంతరాయలు' ఆ తరువాత 'వి' సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా చేశాడు.

ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. అందువలన పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో సుధీర్ బాబు చేసిన సాహసాలు .. విన్యాసాలు వృథా అయ్యాయి. ఎంతో ఇష్టపడి చేసిన పాత్రలను ప్రేక్షకులు ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన కూడా దిగాలు పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాతో మరోసారి ఖాకీ డ్రెస్ వేసుకునే అవకాశం ఆయనకి వచ్చింది. దాంతో ఈ సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా తన విశ్వరూపాన్ని వీలైనంతవరకూ చూపించాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడని అంటున్నారు.

మరి ఆయన ముచ్చటపడి .. ముచ్చటగా మూడోసారి ధరిస్తున్న పోలీస్ వేషం ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి. భవ్య క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పారు.

అలాగే తమిళంలో పాప్యులర్ అయిన భరత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే వాళ్లు ఎలాంటి పాత్రలను చేయనున్నారు? వాళ్ల పాత్రలను ఎలా డిజైన్ చేశారనేది తెలియాల్సి ఉంది. ఇక కథానాయికల విషయంలో కూడా త్వరలో క్లారిటీ రానుంది.