Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాట పల్లవి టైటిలైంది

By:  Tupaki Desk   |   17 Jun 2018 2:07 PM GMT
ఎన్టీఆర్ పాట పల్లవి టైటిలైంది
X
పాత సినిమాల పల్లవుల్నే సినిమా టైటిళ్లుగా మార్చుకునే సంస్కృతి టాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉంది. ఇందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. తాజాగా యువ కథానాయకుడు సుధీర్ బాబు కూడా తన కొత్త సినిమాకు ఓ పాత క్లాసిక్ సాంగ్ పల్లవినే టైటిల్ గా పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ పాటల్లో ఒకటైన ‘నన్ను దోచుకుందువటే’ పాట పల్లవి అతడి సినిమా పేరుగా మారింది. ఇటీవలే సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సుధీర్ సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దాని మీద నిర్మిస్తున్న తొలి చిత్రానికి ‘నన్ను దోచుకుందువటే’ అనే పేరు పెట్టుకున్నాడు సుధీర్. ఈ పేరు చూస్తేనే ఇదొక ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంతో రాజశేఖర్ నాయుడు అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.

ఇందులో సుధీర్ సరసన నాభా న‌టేష్ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. ‘కిరిక్ పార్టీ’ సహా పలు కన్నడ సినిమాలతో మంచి పేరు సంపాదించిన అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్నందిస్తుండగా.. సురేష్ రగుతు ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తయిందట. ఇంకొన్ని రోజుల్లోనే టాకీ పార్ట్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా అవగొట్టి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ నెలాఖర్లో ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందట. ఇటీవలే ‘సమ్మోహనం’తో సుధీర్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అతను ప్రస్తుతం ‘నన్ను దోచుకుందువటే’తో పాటు ‘వీరభోగ వసంతరాయలు’ అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. సెప్టెంబరు నుంచి పుల్లెల గోపీచంద్ బయోపిక్ లోనూ సుధీర నటించబోతున్నాడు.