Begin typing your search above and press return to search.

మహేష్ - విజయ్ కాంబోలో సినిమా స్టార్ట్ అవకపోవడానికి కారణం అదే...!

By:  Tupaki Desk   |   13 Jun 2020 11:50 AM GMT
మహేష్ - విజయ్ కాంబోలో సినిమా స్టార్ట్ అవకపోవడానికి కారణం అదే...!
X
భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న లెజెండరీ దర్శకుడు మణిరత్నం. ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు మణిరత్నం. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం 'గీతాంజలి' బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందీ చిత్రం. 'దళపతి' 'నాయకుడు' 'ఇద్దరు' 'ఘర్షణ' 'రోజా' 'బొంబాయి' 'సఖి' 'నవాబ్' సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మణిరత్నం ఇప్పటి వరకు ఆరు జాతీయ అవార్డులను.. ఎన్నో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులనూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల తదితరులు నటిస్తున్నారని సమాచారం. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆపుకున్న ఈ సినిమా షూటింగ్స్ అనుమతి లభించిన వెంటనే ప్రారంభం కానుంది. కాగా తెలుగులో 'గీతాంజలి' సినిమాకి దర్శకత్వం వహించిన మణిరత్నం.. రామ్ గోపాల్ వర్మ 'గాయం' సినిమాకి రచయితగా పనిచేసారు. ఆ తర్వాత ఎప్పటి నుండో తెలుగులో సినిమా రూపొందించాలని అనుకున్నా ఎందుకో కుదరలేదు.

ఇదిలా ఉండగా మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాని మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు - ఇళయదళపతి విజయ్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. నాలుగేళ్ళ క్రితం వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు వేరే స్టార్ క్యాస్ట్ తో సినిమా పట్టాలెక్కించేసాడు మణి. అయితే ఇటీవల మణిరత్నం సతీమణి సుహాసిని మహేష్ - విజయ్ లతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించకపోవడానికి గల కారణాలను వెల్లడించిందట. సుహాసిని మాట్లాడుతూ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ ప్రాజెక్ట్ ముందుగా మహేష్ - విజయ్ లతో అనుకున్నారు. కానీ ఆ సమయంలో మణిరత్నం విజన్ ని సిల్వర్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే వీఎఫెక్స్ టీమ్ దొరకలేదు. అందుకే అప్పుడు ఆ ప్రాజెక్ట్ వారి కాంబోలో స్టార్ట్ అవలేదని చెప్పుకొచ్చిందట. కాగా తమిళ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాని లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.