Begin typing your search above and press return to search.

బన్నీ కోసం సుక్కూ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారంటే..?

By:  Tupaki Desk   |   17 Jan 2022 7:26 AM GMT
బన్నీ కోసం సుక్కూ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారంటే..?
X
సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప' పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

'పుష్ప: ది రైజ్' సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ టాక్ తో సంబంధం లేకుండా సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో అల్లు అర్జున్ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. హిందీ వెర్షన్ సింగిల్ గా 80 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. స్మగ్లర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ డీ గ్లామర్ పాత్రలో బన్నీ అద్భుతమైన పెరఫార్మెన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారని చెప్పాలి.

'పుష్ప' మొదటి భాగంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియన్ స్టార్‌ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో బన్నీ రెండేళ్ల క్రితం నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ తో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అల్లు స్టార్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి హిందీ డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారమంతా పుష్ప రెండో భాగం 'పుష్ప: ది రూల్' సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తోందనడంలో సందేహం లేదు. అలానే అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ డైరెక్టర్ సుకుమార్ మీద కాస్త ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని.. మల్టీలాంగ్వేజ్ లలో ఒకేసారి విడుదల చేయాలని సుక్కూ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. కానీ లక్కీగా ఈ స్టోరీ మరియు హీరో క్యారక్టరైజేషన్ అన్ని భాషల వారికి కనెక్ట్ అయింది.

కానీ 'పుష్ప' పార్ట్ 2 విషయంలో అలా కాదు. దీనిపై ఇప్పటికే ఉత్తరాదిన అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని భాషల వారిని అలరించే విధంగా కథ కథనాలు ఉండాలి. అందుకే 'పుష్ప: ది రూల్' కోసం సుకుమార్ అండ్ టీమ్ స్క్రిప్ట్ లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ జనాలను - బాలీవుడ్ లో బన్నీకి వచ్చే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ రెడీగా ఉన్న కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట.

మొదటి భాగంలో అర్థాంతరంగా ఉన్న పాత్రలకు ముగింపు ఇవ్వడంతో పాటుగా యాక్షన్ మరియు బలమైన ఎమోషన్స్ మీద సుకుమార్ ఫోకస్ పెట్టనున్నారట. అంతేకాదు ఈసారి హడావిడిగా కాకుండా అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రెండు నెలల ముందే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. తరువాతే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి నెలలో 'పుష్ప' పార్ట్ 2 సెట్స్ మీదకు రానుంది.