Begin typing your search above and press return to search.

`నార్కోస్` సీరీస్‌ని స్టార్ డైరెక్ట‌ర్ ఎత్తేశారా?

By:  Tupaki Desk   |   21 Dec 2021 11:30 PM GMT
`నార్కోస్` సీరీస్‌ని స్టార్ డైరెక్ట‌ర్ ఎత్తేశారా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప‌` పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతోంది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. పుష్ప‌రాజ్ గా బ‌న్నీ వ‌న్ మ్యాన్ షో తో పాటు సుకుమార్ ద‌ర్శ‌కత్వ ప్ర‌తిభ‌పై ప్రేక్ష‌కుల్లో వున్న అంచ‌నాలే ఈ చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ల‌భించేలా చేశాయి.

అంతే కాకుండా ఈ సినిమాకి ముందు సుకుమార్ `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించ‌డం, అందులో త‌న రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా హీరో పాత్ర‌ని ప్ర‌జెంట్ చేయ‌డం తో పాటు ఎంచుకున్న క‌థ, క‌థ‌నాలు ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచాయి.

సినిమా కూడా ఎక్క‌డో ఎత్తిన క‌థ‌గా క‌నిపించ‌లేదు. ఎందుకంటే సుకుమార్ ఎత్తిన క‌థ‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డు కాబ‌ట్టి. అయితే `పుష్ప‌` విష‌యంలోనూ ఇదే రిపీట్ అవుతుంద‌ని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా నెట్ ఫ్లిక్స్ ఫేమ‌స్ వెబ్ సిరీస్ నుంచి కొన్ని సీన్ ల‌ని ఎత్తేసిన‌ట్టుగా కనిపిస్తోంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

`ఊ అంటావా మావా.. ` ట్యూన్ కూడా కాపీ అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ జ‌రిగింది. దాన్ని ప‌క్క‌న పెడితే `నార్కోస్‌` ని స్ఫూర్తిగా తీసుకునే సుకుమార్ ఈ సినిమా చేసిన‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఓ డ్ర‌గ్ ట్రాఫిక‌ర్ పాబ్లో ఎస్కోబార్ అనే సాధార‌ణ వ్య‌క్తి స్మ‌గ్ల‌ర్ గా ఎదిగిన తీరుని, కొలంబియా నుంచి డ్ర‌గ్స్‌ని అమెరికారు ఎలా త‌ర‌లించాడ‌నే దాన్ని `నార్కోస్` పార్ట్ 1లో చూపించారు. ఇదే క‌థ‌ని మ‌న నేటివిటీకి మార్చి `పుష్ప‌`గా సుకుమార్ చేసిన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. `నార్కోస్` ఓ డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ బ‌యోపిక్.

అయితే దాన్ని తెలుగుకు మార్చి గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందించ‌డం బాగానే వుంది కానీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ని కూడా ప‌క్కాగా కాపీ చేయ‌డం .. కాక‌పోతే దానిని తెర‌కెక్కిచిన తీరుని మార్చ‌డం.. పోలీసుల‌తో బేరం ఆడుతున్న హీరో వారు అంగీక‌రించ‌క‌పోవ‌డం తో కొడుతూ బేరం మాట్లాడ‌టం ఇక్క‌డ వేరే స్టైల్‌.

క‌ట్ చేస్తే.. పుష్ప‌రాజ్ `గంధ‌పు చెక్క‌ల లారీని పోలీసుల క‌ళ్ల ముందే మాయం చేయ‌డంతో అత‌న్నిస్టేష‌న్‌కి తీసుకెళ్లి వీర‌లెవెల్లో కుమ్మేయ‌డం. ఎంత కొట్టినా న‌వ్వుతూనే వున్నాడ‌ని ఓ పోలీస్ చెప్ప‌డం. సేమ్ సీన్ `నార్కోస్‌`లోనూ క‌నిపిస్తుంది. పాబ్లోని స్టేష‌న్ కి ర‌ప్పించి క్రిమిన‌ల్ రికార్డుల్లోకి ఎక్కించ‌డానికి ఓ పోలీస్ అధికారి ఫొటోలు తీయిస్తాడు.

అయితే ఈ సంద‌ర్భంగా పాబ్లో న‌వ్వుతూనే క‌నిపిస్తాడు. అది చూసిన ఓ పోలీస్ వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి న‌వ్వుతూనే వున్నాడ‌ని అంటాడు. డైలాగ్ కూడా సేమ్ టు సేమ్ దించేయ‌డంతో సుక్కు ఇలా ఎత్తేశాడేంట‌ని అవాక్క‌వుతున్నారు.

ఇక బ‌న్నీ పాత్ర‌ని కూడా పాబ్లోని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేపిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కాక‌పోతే అందులోని పాత్ర‌కు గ‌డ్డం లేదు.. ఇక్క‌డ వుంది అంతే తేడా... ఇక ల‌వ్ ట్రాక్ మాత్రం కొత్త‌గా యాడ్ చేశాడు.

నేటివిటీ వుండాలి క‌దా కాబ‌ట్టి. ఇక మిగ‌తా క్యారెక్ట‌ర్ ల‌ని కూడా సుక్కు `నార్కోస్` నుంచే ఎత్తేసిన‌ట్టుగా కనిపిస్తోంది. కొండారెడ్డి, అత‌ని బ్ర‌ద‌ర్స్ పాత్ర‌ల‌ని తీర్చి దిద్దిన తీరు, అందులో ఒక‌డికి అమ్మాయిల‌ పిచ్చి వున్న‌ట్టుగా చూపించ‌డం `నార్కోస్`లోని పాత్ర‌ల‌ని పోలి వుంది. ఇక `పుష్ప‌` పార్ట్ 2 లోనూ నార్కోస్ ఛాయ‌లు క‌నిపిస్తే లెక్క‌ల మాస్టారు అడ్డంగా దొరికిపోయిన‌ట్టే అంటున్నారు.

ఇదంతా ఎందుకంటే సుకుమార్ అంటే ఒరిజిన‌ల్ క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్. అలాంటి సుక్కు ఇలా ఎత్తిపోత‌ల‌తో పాన్ ఇండియా సినిమా తీయ‌డ‌మేంటీ? .. `బాహుబ‌లి`తో తెలుగు సినిమా అంటే కాల‌ర్ ఎగ‌రేశాం.

కానీ ఎత్తిపోత‌ల సినిమా అనే అప‌వాదు మొద‌లైతే తెలుగు సినిమా మ‌ర్యాద‌.. గౌర‌వం దెబ్బ‌తింటాయి. అది జ‌ర‌క్కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త సుకుమార్ దే. గొప్ప క‌థ‌ల్ని ప్ర‌పంచానికి అందించే స‌త్తా వుండి కూడా ఇలాంటి ఎత్తిపోత‌ల‌కు త‌లొగ్గొద్ద‌ని, సినీ అభిమానులు సుక్కుని రిక్వెస్ట్ చేస్తున్నారు.