Begin typing your search above and press return to search.

సుక్కు డైలాగ్‌ కు ప్రకాష్ రాజ్ పడిపోయిన వేళ..

By:  Tupaki Desk   |   18 Sep 2016 9:30 AM GMT
సుక్కు డైలాగ్‌ కు ప్రకాష్ రాజ్ పడిపోయిన వేళ..
X
సుకుమార్ దర్శకత్వంలో ఒకే సినిమా చేశాడు ప్రకాష్ రాజ్. అదే.. జగడం. అందులో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. పోలీసాఫీసర్‌ గా చిన్న క్యామియో రోల్. ఐతే ఈ సినిమాకు పని చేయడం కంటే ముందు ప్రకాష్ రాజ్‌ తో పరిచయం ఉందట సుకుమార్‌ కు. తాను సినీ రంగంలో తొలి ప్రశంస అందుకున్నది ప్రకాష్ రాజ్ నుంచే అంటూ.. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు సుకుమార్.

‘‘నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పని చేసిన తొలి సినిమా ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. ఆ సినిమా సమయంలోనే ప్రకాష్ రాజ్ గారు పరిచయం. దానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చెబుతాను. ఒక రోజు ప్రకాష్ రాజ్ గారి చేతికి ఒక పేజీ డైలాగ్ పేపర్ వచ్చింది. ఆ సన్నివేశంలో ఆయన చదువు గురించి మాట్లాడాలి. అందులో ‘‘ఈ రెండు వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు.. కానీ ఈ రెండూ కలవాలంటే చదువు కావాలి’’ అనే డైలాగ్ ఒకటుంటుంది. అది చదివిన వెంటనే ఈ డైలాగ్ ఎవరు రాశారని ప్రకాష్ రాజ్ అడిగారు. ఇదిగో ఈ కుర్రాడే అంటూ నన్ను చూపించారు. వెంటనే ఆయన డైలాగ్ చాలా బాగుందంటూ నన్ను అభినందించారు.

నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా గురించి తెలుసున్నారు. ఏం చదివావ్.. ఏమైనా రాశావా.. పొయెట్రీ తెలుసా అని అడిగారు. అది నాకు దక్కిన మొదటి ప్రశంస. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నా తొలి ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం చెప్పాను. ‘జగడం’ సినిమాకు రెండు రోజులు పని చేశాను. ఆ సమయంలో కూడా ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. మామూలుగా దర్శకులు నటులకు సూచనలిస్తారు. వాళ్లను మౌల్డ్ చేస్తారు. కానీ ప్రకాష్ రాజ్ దర్శకుల్ని ఇన్‌ స్పైర్ చేస్తారు’’ అని సుకుమార్ అన్నాడు.