Begin typing your search above and press return to search.

అది మిస్సయినందుకు సారీ చెప్పిన సుక్కు

By:  Tupaki Desk   |   14 April 2018 7:59 AM GMT
అది మిస్సయినందుకు సారీ చెప్పిన సుక్కు
X
సుకుమార్ సినిమా అనగానే టైటిళ్ల దగ్గర్నుంచే జనాల్లో ఆసక్తి మొదలవుతుంది. అక్కడి నుంచే తన క్రియేటివిటీని చూపిస్తుంటాడు సుక్కు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటి.. దాని థీమ్ ఏంటన్నది టైటిళ్లలోనే చూపించే ప్రయత్నం చేస్తాడు సుక్కు. ‘100 పర్సంట్ లవ్’.. ‘1 నేనొక్కడినే’.. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల్లో ఆ ఒరవడిని చూడొచ్చు. ఐతే ‘రంగస్థలం’ సినిమా టైటిళ్ల విషయంలో మాత్రం సుకుమార్ ముద్ర మిస్సయినట్లు అనిపించింది. నిజానికి 80వ దశకం నేపథ్యంలో సినిమా తీసిన సుకుమార్.. టైటిళ్లలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి మంచి అవకాశమే ఉంది. కానీ అతను చాలా మామూలుగా టైటిళ్లు నడిపించేశాడు.

మరి మీ ముద్ర ఏమైంది అని అడిగితే.. నిజానికి తాను తన స్టైల్ ఫాలో అవ్వడానికే ప్రయత్నించానని సుకుమార్ తెలిపాడు. తన సినిమా అంటే టైటిళ్ల విషయంలో జనాలు ఏదో ఆశిస్తారని దృష్టిలో ఉంచుకుని రకరకాల ఐడియాలు ట్రై చేశానని.. 80ల నాటి వస్తువుల్ని చూపిస్తూ వాటిలోనే టైటిల్స్ వేయాలని ప్లాన్ చేశానని.. కంటెంట్ కూడా రెడీ అయిందని.. కానీ దాని వల్ల సినిమా నిడివి ఇంకో మూణ్నాలుగు నిమిషాలు పెరిగిందని.. అప్పటికే లెంగ్త్ 3 గంటలకు చేరుకోవడంతో ఇబ్బందిగా మారిందని చెప్పాడు. దీంతో తన క్రియేటివిటీని పక్కన పెట్టేయాలని.. టైటిల్స్ పడేటపుడు కూడా కొంత కథను చెప్పడం ద్వారా టైం సేవ్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తన సినిమా టైటిల్స్ వైవిధ్యంగా ఉంటాయని ఆశించి నిరాశ చెందిన వాళ్లకు సుకుమార్ సారీ చెప్పాడు.