Begin typing your search above and press return to search.

దర్శకుడు కావాల్సినోడిని హీరోను చేసేశారట

By:  Tupaki Desk   |   30 July 2017 6:38 AM GMT
దర్శకుడు కావాల్సినోడిని హీరోను చేసేశారట
X
టాలీవుడ్లో హీరో కావాలనుకుని వచ్చి దర్శకులైన వాళ్లు కొందరున్నారు. అలాగే దర్శకులు కావాలని వచ్చి హీరోలైన వాళ్లూ ఉన్నారు. రవితేజ.. అల్లరి నరేష్.. నాని లాంటి వాళ్లు ఈ కోవకే చెందుతారు. సుకుమార్ అన్న కొడుకు అశోక్ కూడా ఈ జాబితాలో చేర్చాల్సిన వాడేనట. తన బాబాయ్ బాటలో అతను కూడా దర్శకుడు కావాల్సిందట. కానీ అనుకోకుండా హీరో అయిపోయాడట. ఈ విషయం సుకుమారే స్వయంగా వెల్లడించాడు. తన అన్న కొడుక్కి డైరెక్షన్ టాలెంట్ ఉందంటూ సుకుమారే స్వయంగా సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. ఆ టాలెంట్ గురించి సుక్కు ఇంకా ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను నా కుటుంబ సభ్యులెవరినీ సినిమాల్లో ఎంకరేజ్ చేయలేదు. అశోక్ కూడా సినిమాల్లోకి వస్తానంటే ప్రోత్సహించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశమివ్వమని అడిగితే.. ‘నేనైతే ఎంకరేజ్ చేయను. నువ్వొచ్చి టాలెంట్ నిరూపించుకుంటే నా దగ్గర చేర్చుకుంటా’ అని కరాఖండిగా చెప్పేశా. ఐతే ‘1 నేనొక్కడినే’ టైంలో నేను నా అసిస్టెంట్ డైరెక్టర్లందరితోనూ డిఫరెంట్ వెర్షన్స్ రాయిస్తూ.. అశోక్ ను కూడా ఒక వెర్షన్ రాయమన్నాను. నా అన్న కొడుకు అని కాదు కానీ.. అప్పుడు రాసిన వెర్షన్లన్నింట్లో బెస్ట్ వెర్షన్ అశోక్ దే అయింది. దీంతో అతడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశమిచ్చాను. అలా అతను డైరెక్షన్ వైపు వెళ్తాడనుకుంటే.. నా మిత్రుడైన జక్కా హరి ప్రసాద్ తాను దర్శకుడు కావడం కోసం కాబోయే ఒక దర్శకుడిని హీరోను చేసేశాడు. అతను కథ చెప్పినపుడు ఎవరైనా హీరోకు వినిపించమంటే.. ఎవరో ఎందుకు అశోక్ తో చేసేద్దామన్నాడు. ఏదేమైనా మా అశోక్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా’’ అని సుకుమార్ చెప్పాడు.