Begin typing your search above and press return to search.

నష్టం నాకే.. నిర్మాతకు కాదు-సుకుమార్

By:  Tupaki Desk   |   25 March 2018 9:51 AM GMT
నష్టం నాకే.. నిర్మాతకు కాదు-సుకుమార్
X
తెలుగులో సినిమాకు సినిమాకు బాగా గ్యాప్ తీసుకునే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. సినిమా ప్రొడక్షన్ విషయంలోనూ బాగా లేటు చేస్తాడనే పేరుంది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతున్నా సుకుమార్ ఇప్పటికి ఏడు సినిమాలే తీయగలిగాడు. ఇది కెరీర్ కు ఇబ్బందే కదా అని సుకుమార్ ను అడిగితే.. తన శైలి వల్ల తనకు నష్టమే తప్ప నిర్మాతలకేమీ ఇబ్బంది లేదని అన్నాడు. తన స్వభావ రీత్యా సినిమాలు నెమ్మదిగా తీస్తున్నట్లు అతను చెప్పాడు.

‘‘ఒక వ్యక్తి నెమ్మదిగా నడుస్తాడు. మరో వ్యక్తి చాలా వేగంగా నడుస్తాడు. అది వాళ్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. నాకు కథ ఓ పట్టాన నచ్చదు. దాని కోసం బాగా కసరత్తు చేస్తాను. అక్కడే ఎక్కువ సమయం పడుతుంది. కథ బాగా రావాలనే ఈ తపనంతా. నా వల్ల నిర్మాతలకేమీ ఇబ్బంది లేదు. నష్టమంతా నాకే. ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నా సినిమాలే తగ్గిపోతాయి. ఐతే సినిమా మొదలుపెట్టాక ఏడాదిలోపే పూర్తి చేస్తా. ‘రంగస్థలం’ గత ఏడాది ఏప్రిల్లో మొదలుపెట్టాం. ఈ మార్చిలో మొదలవుతుంది. అంటే ఏడాది లోపే పూర్తయిందిగా’’ అని సుకుమార్ అన్నాడు.

తాను స్క్రిప్టు విషయంలో త్వరగా సంతృప్తి చెందనని.. అసంతృప్తి నుంచే అద్భుతాలు పుడతాయన్నది తన ఉద్దేశమని సుకుమార్ చెప్పాడు. ‘రంగస్థలం’ తన జీవిత అనుభవాల్లోంచి పుట్టిన సినిమా కాబట్టి ఇది తన మనసుకు బాగా చేరువైందని.. అలాగే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందని సుకుమార్ ధీమా వ్యక్తం చేశాడు.