Begin typing your search above and press return to search.

ఆ ఐదారు గంటలు నరకం అనుభవించా-సుక్కు

By:  Tupaki Desk   |   17 Feb 2016 7:30 AM GMT
ఆ ఐదారు గంటలు నరకం అనుభవించా-సుక్కు
X
తన ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం మామూలైపోయిందని.. ‘నాన్నకు ప్రేమతో’కు కూడా అలాంటి టాకే వచ్చేసరికి చాలా టెన్షన్ అనుభవించానని అంటున్నాడు సుకుమార్. డివైడ్ టాక్ వచ్చినా టెన్షనేం పడలేదు అనే రొటీన్ మాటలు తాను చెప్పనని.. నిజంగా ఈ సినిమాకు ఇలాంటి టాక్ వచ్చినపుడు చాలా బాధపడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అన్నాడు సుక్కు.

‘‘నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు కొన్ని రోజుల పాటు రేయింబవళ్లు పని చేశా. దీంతో రాత్రి 3 గంటల తర్వాత పడుకునేవాణ్ని. రిజల్ట్ విషయంలో ఏమైనా సందేహాలుంటే అప్పుడు కూడా నిద్రపోయేవాణ్ని కాదు. ఉదయం 8 గంటలకు లేచాను. అందరూ సినిమా బాగుందంటూ ప్రశంసించారు. కాల్ చేశారు. మెసేజ్ లు పెట్టారు. ఐతే మధ్యాహ్నం అయ్యాక ఇండస్ట్రీలో డివైడ్ టాక్ వినిపించింది. దీంతో చాలా బాధేసింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. ఎందుకంటే ఈ సినిమాతో సక్సెస్ సాధించడం నాకు చాలా చాలా అవసరం. ‘1 నేనొక్కడినే’ అలా అయినప్పటికీ నాకు ఇంకో అవకాశం లభించింది. ఆ సినిమా గురించి మీడియాతో పాటు అందరూ ప్రశంసించారు. అందువల్ల యుఎస్ లో, నగరాల్లో బాగానే ఆడింది.

‘నాన్నకు ప్రేమతో’ అనేది నాకు లాస్ట్ ఛాన్స్ లాంటిది. ఈ సినిమా కూడా తేడా అయితే నా పరిస్థితి ఏమవుతుందో తెలుసు. అందుకే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐదారు గంటలు నరకయాతన అనుభవించా. ఐతే రాత్రి నిర్మాత ప్రసాద్ కొడుకు బాపి ఫోన్ చేసి సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందని.. అన్ని సెంటర్లలోనూ ఫుల్స్ తో ఆడుతోందని చెప్పాడు. ఎప్పుడూ లేనిది మా ఊరు నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వచ్చాయి. అప్పుడు అర్థమైంది సినిమా అందరికీ నచ్చిందని, బాగా ఆడుతోందని. దీంతో ఊపిరి పీల్చుకున్నా’’ అన్నాడు సుక్కు.