Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ మట్టిమనిషి-సుకుమార్

By:  Tupaki Desk   |   16 July 2017 4:20 AM GMT
రామ్ చరణ్ మట్టిమనిషి-సుకుమార్
X
తన మిత్రుల గురించి.. తన హీరోల గురించి.. తన టెక్నీషియన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటాడు సుకుమార్. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ ఆడియో వేడుకలోనూ సుక్కు ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’లో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ గురించి.. అలాగే ‘దర్శకుడు’తో దర్శకుడిగా పరిచయం కానున్న తన మిత్రుడు హరి ప్రసాద్ జక్కా గురించి సుకుమార్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. దర్శకుడు ఆడియో వేడుకలో ఆయన ఏమన్నాడంటే..

‘రంగస్థలం’ సినిమా చేసే ముందు రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు కదా.. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా.. ఇతడితో ఎలా డీల్ చేయాలా అనుకున్నాను. కానీ అతను మనం అనుకున్న రకం కాదు. అతనో మట్టి మనిషి. కాఫీలో బెల్లం కలుపుకుని తాగే బాబు. పాపికొండలు షూటింగుకి వెళ్లినపుడు మేమందరం ట్యూన్ అయిపోయాం. మేమంతా సన్ స్క్రీన్ రాసుకుంటే అతను మాత్రం పులిసిన పెరుగులో సున్నిపిండి కలుపుకుని రాసుకునే బాబు. చాలా సహజంగా ఉంటాడు. ఒదిగి ఉంటాడు. మనం దూరం నుంచి చూసి మనం ఈ క్రీమ్ వాడతాం.. ఈ సెంట్ వాడతాం.. ఈ పేస్ట్ వాడతాం. అతనేం వాడతాడో అనుకుంటాం. కానీ చరణ్ వేప పుల్లతో పళ్లు తోముకునే బాబు.

ఇక హరిప్రసాద్ విషయానికి వస్తే అతను నాకు ఆప్తమిత్రుడు. నేను కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ గా ఉన్నపుడు అతను అక్కడ ఫిజిక్స్ చెప్పేవాడు. చాలా షార్ప్. అతను నాకు గూగుల్ లాంటి వాడు. అతను నా హార్డ్ డిస్క్ అని కూడా చెప్పొచ్చు. ఏమడిగినా చెప్పేవాడు. అద్భుతమైన మెమొరీ అతడి సొంతం. నేను సినిమా రంగంలోకి వచ్చాక అతను కూడా ఇక్కడికి వచ్చేశాడు. నేను కెరీర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నపుడు నాకు అండగా నిలిచాడు. నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ‘1 నేనొక్కడినే’కు కథ ఇవ్వడమే కాదు.. నా చాలా కథలకు సాయం చేశాడు. అతను ఏ సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అయినా ‘దర్శకుడు’ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ కథ చెప్పగానే.. నువ్వే డైరెక్ట్ చెయ్యి అన్నాను. చేసేశాడు’’ అని సుకుమార్ చెప్పాడు.