Begin typing your search above and press return to search.

జ‌గ‌డంలో మహేశ్ కాస్తా రామ్ ఎందుకొచ్చాడు?

By:  Tupaki Desk   |   9 April 2018 5:30 PM GMT
జ‌గ‌డంలో మహేశ్ కాస్తా రామ్ ఎందుకొచ్చాడు?
X
ఇండ‌స్ట్రీలో చాలా జ‌రుగుతుంటాయి. చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రావు. మీడియా పుణ్య‌మా అని బ‌య‌ట‌కు వ‌చ్చినా.. వాటి మీద రియాక్ట్ కావ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. మిగిలిన రంగాల‌తో పోలిస్తే సినిమా రంగంలో వివాదాన్ని కిలోమీట‌ర్ల దూరంలోనే ఆపేస్తారు. ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌టానికి అస్స‌లు ఒప్పుకోరు. కాంట్రావ‌ర్సీల‌తో లింక్ అయితే.. కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న ఉద్దేశంతో వివాదాల మీద మాట్లాడ‌టానికి అస్స‌లు ఇస్ట‌ప‌డ‌రు. ఇంట‌ర్వ్యూల‌లో అడిగినా.. సున్నితంగా మాట‌ను దాటేస్తుంటారు.

అయితే.. అందుకు భిన్నంగా చెప్పి.. చెప్ప‌న‌ట్లుగా చెప్పేసి.. ఇష్యూను క్లోజ్ చేసే తీరు కొంద‌రిలో ఉంటుంది. అలాంటి వారిలో ద‌ర్శ‌కుడు సుకుమార్ ఒక‌రు.రంగ‌స్థ‌లం పుణ్య‌మా అని ఆయ‌న‌కో కొత్త త‌ర‌హా క్రేజ్ వ‌చ్చింది. మంచి ద‌ర్శ‌కుడన్న పేరున్నా.. పూర్తిగా న‌మ్మ‌లేని ప‌రిస్థితి. రంగ‌స్థ‌లం ఆ లోటును తీర్చేసింది.

ప్ర‌స్తుతం స‌క్సెస్ ను తీరుబ‌డిగా ఎంజాయ్ చేస్తున్న సుకుమార్.. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అలా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. త‌న‌కున్న ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌న్న విష‌యాన్ని చెబుతూ.. తాను చేసిన త‌ప్పును ఒప్పుకున్నారు.

ఎమోష‌న్స్ తో ఉన్న‌ప్పుడు జ‌డ్జిమెంట్ క‌రెక్ట్ గా ఉండ‌ద‌ని.. ఆర్య అయిపోయిన వెంట‌నే జగ‌డం బ‌న్నీతో తీయాల‌నుకున్నాన‌ని చెప్పారు. అయితే.. దిల్ రాజుతో చిన్న స‌మ‌స్య రావ‌టంతో ఎమోష‌న్ కి గురై.. రాత్రికి రాత్రి రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి జ‌గ‌డం అనౌన్స్ చేశాన‌న్నారు.

రాజు మీద కోపం ఉన్నా.. సినిమా ఓపెనింగ్ కు మాత్రం ఆయ‌న్ను.. బ‌న్నీని పిలిచాన‌న్నారు. రాజు వ‌చ్చి తిట్టార‌ని.. బుద్దుందా.. ఏం చేస్తున్నావు? అంటూ కోపంగా తిట్టార‌ని.. త‌న‌కు కోపం వచ్చింద‌ని చెప్పాన‌న్నారు. కోపం వ‌స్తే సినిమా మొద‌లెట్టేస్తావా? అంటూ క్లాస్ పీకార‌న్నారు. నాది అమాయ‌క‌త్వ‌మ‌ని రాజుకు తెలీటంతో ఆయ‌న త‌న‌ను క‌రెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటార‌న్నారు. నాది వీర‌త్వం అనుకున్నాన‌ని కానీ ఎమోష‌న్ లో త‌ప్పు చేస్తున్న విష‌యం అర్థం కాలేద‌న్నారు.

జ‌గ‌డం బ‌న్నీ లేదంటే మ‌హేశ్ కోసం రాసుకున్న‌ద‌ని.. ఆ సినిమాకు మ‌హేశ్ హీరోగా ఉండాల‌ని.. రామ్ అత‌ని త‌మ్ముడు క్యారెక్ట‌ర్ చేయాల‌ని.. కానీ రామ్ హీరో కావ‌టం.. త‌మ్ముడు మ‌రింత చిన్నోడ‌యిపోయాడ‌న్నారు. టోట‌ల్ గా క‌థ మారిపోవ‌టం జ‌గ‌డం పోయింద‌న్నారు. ఈ సినిమా పోవ‌టంతో ఎలా ఉండాలో త‌న‌కు అర్థ‌మైంద‌న్నారు.

ఈ మ‌ధ్య‌న సుకుమార్ గ‌డ్డంతో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఎందుకిలా అంటే.. కొత్త విష‌యాన్ని చెప్పుకొచ్చారు. గ‌డ్డం ముందు నుంచి ఉన్నా.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో తార‌క్ కూడా గ‌డ్డం ఉంటుంద‌ని.. ఆ సినిమా నుంచి కంటిన్యూ అవుతుంద‌న్నారు. త‌న గ‌డ్డం వెనుక మ‌రో విష‌యం ఉంద‌ని.. త‌న ముఖం చిన్న‌గా ఉంటుంద‌ని..గ‌డ్డంలో ఉన్న‌ప్పుడు అద్దంలో చూసుకుంటే కాన్ఫిడెన్స్ వ‌చ్చిన‌ట్లుంటుంద‌ని.. ఎవ‌రి ముందైనా నిలుచోవ‌టానికి ధైర్యం ఉంటుంద‌ని అందుకే గ‌డ్డ‌మ‌న్నారు. త‌న గ‌డ్డం చిరిగిన మ‌న‌సుకు ప్ర‌తిరూపం కాద‌ని.. ఫేస్ లోని లోపాల్ని దాచేందుకు చిన్న‌పాటి మేక‌ప్ గా చెప్పారు. సుక్కు గ‌డ్డం వెనుక లెక్క చాలానే ఉందే.