Begin typing your search above and press return to search.

హిందీ సినిమాకు ప్రాణం లేచొస్తోంది

By:  Tupaki Desk   |   27 Jun 2016 5:30 PM GMT
హిందీ సినిమాకు ప్రాణం లేచొస్తోంది
X
ఎంతైనా పెద్ద హీరోల సినిమాలు రిలీజైన‌పుడు ఉండే సంద‌డే వేరు. బాలీవుడ్లో ఈ ఏడాది బాక్సాఫీస్ ను క‌ళ‌క‌ళ‌లాడించి బ‌డా మూవీ ఒక్క‌టీ లేదు. షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’ వ‌చ్చింది కానీ.. అది జ‌నాల్ని థియేట‌ర్ల‌కు పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ షారుఖ్ సినిమాకూ లేనంత త‌క్కువ ఓపెనింగ్స్ వ‌చ్చాయి ఫ్యాన్‌ కు. ఎయిర్ లిఫ్ట్.. హౌస్ ఫుల్-3 లాంటి సినిమాల‌కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి కానీ.. మ‌రీ బాక్సాఫీసేమీ షేకైపోలేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అస‌లైన ఊపు క‌నిపించేది ఖాన్ త్ర‌యం సినిమాలు వ‌చ్చినపుడే. అవి మంచి టాక్ తెచ్చుకున్న‌పుడే. ఈ ఏడాది తొలి ఆరు నెల‌ల్లో ఆ ఊపే క‌నిపించ‌లేదు. అసలెక్క‌డా క‌లెక్ష‌న్ల రికార్డుల గురించి చ‌ర్చే జ‌ర‌గ‌లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు స‌ల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’ తో ఆ ఊపు రాబోతోంది. ఈ సినిమా జులై 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇప్ప‌టిదాకా ‘హౌస్ ఫుల్-3 మాత్ర‌మే వంద కోట్ల క్ల‌బ్బులో చేరింది. స‌ల్మాన్ సినిమా ఓపెనింగ్ వీకెండ్లోనే ఆ ఘ‌న‌త సాధించే అవ‌కాశాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్.. ఓపెనింగ్స్ విష‌యంలో ‘సుల్తాన్’ హ‌వా సాగ‌డం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే ఈజీగా 500 కోట్ల క్ల‌బ్బులో చేరే అవ‌కాశాలున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాత. అనుష్క శర్మ సల్మాన్ సరసన తొలిసారి కథానాయికగా నటించింది.