Begin typing your search above and press return to search.

దత్తతకు ముందుకు వచ్చిన సుమ - రాజీవ్‌..!

By:  Tupaki Desk   |   18 Sep 2018 8:29 AM GMT
దత్తతకు ముందుకు వచ్చిన సుమ - రాజీవ్‌..!
X
భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెల్సిందే. అందమైన కేరళను పునర్‌ నిర్మించేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. కేరళ కోసం పలువురు పలు రకాలుగా సాయం చేశారు, చేసేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులతో పాటు సినీ వర్గాల వారు ఎక్కువగా కేరళ కోసం విరాళాలు ఇవ్వడం జరిగింది. తెలుగు మరియు తమిళ పరిశ్రమకు చెందిన ఎంతో మంది తమ మంచి మనసును చాటుకుని వారి స్థాయికి తగ్గట్లుగా విరాళాలు ఇచ్చారు. తాజాగా యాంకర్‌ సుమ మరియు రాజీవ్‌ కనకాల కేరళలోని అలప్పీలో ఒక భవనంను దత్తత తీసుకుని బాగు చేసేందుకు ముందుకు వచ్చారు.

వర్షాల వల్ల అత్యధికంగా నష్టపోయిన ప్రాంతం అలప్పీ. తాజాగా కేరళ ప్రభుత్వం అలప్పీ లోని ఏదైనా భవనంను దత్తత తీసుకుని బాగు చేయించేందుకు దాతలు ముందుకు రావాలి అంటూ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రకటనకు మద్దతుగా కేరళకు చెందిన సుమ స్పందించారు. అలప్పీ లోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌ ను బాగు చేసేందుకు సిద్దం అయ్యారు. ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఆ సెంటర్‌ వరదల కారణంగా బాగా దెబ్బ తినడం జరిగిందట. దాంతో ఆ భవనంను పూర్తిగా సొంత ఖర్చులతో సుమ దంపతులు బాగు చేయించబోతున్నారు.

ఈ సందర్బంగా సుమ దంపతులు మాట్లాడుతూ.. కేరళకు సాయం చేసేందుకు మీరు అంతా కూడా ముందుకు వచ్చారు. అలప్పీ కోసం ఇప్పుడు ఒక మంచి క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఏదైనా ఒక బిల్డింగ్‌ను దత్తత తీసుకుని బాగు చేయించవచ్చు. మేము ఫ్యామిలీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్న ఆ బిల్డింగ్‌ వెంటనే పునర్‌ నిర్మించబడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం గురించి తెలియజేసిన సబ్‌ కలెక్టర్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా దత్తతకు మరెవ్వరైనా ఆసక్తిగా ఉంటే వెంటనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సుమ దంపతులు రిక్వెస్ట్‌ చేయడం జరిగింది. మంచి మనస్సుతో బిల్డింగ్‌ ను దత్తత తీసుకుని పునర్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చిన సుమ, రాజీవ్‌ కనకాలను అంతా అభినందిస్తున్నారు.