Begin typing your search above and press return to search.

అసలు నాగ్ అనుమతి తీసుకున్నాడా?

By:  Tupaki Desk   |   6 Aug 2018 10:44 AM GMT
అసలు నాగ్ అనుమతి తీసుకున్నాడా?
X
మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తే నిజమైంది. నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్’లో ఏఎన్నార్ పాత్రను ఆయన మనవడు సుమంత్ చేయబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సుమంత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఐతే సుమంత్ ఈ పాత్ర చేయడానికి అతడి మావయ్య.. ఏఎన్నార్ తనయుడు అక్కినేని నాగార్జున అనుమతి ఇచ్చాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మామూలుగా వస్తే ఈ సందేహం కలిగేది కాదు కానీ.. కొన్నేళ్లుగా బాలయ్యతో నాగ్ సంబంధాల్ని బట్టి చూస్తే మాత్రం ఈ డౌట్ రాకుండా మానదు. ఒకప్పుడు చాలా సన్నిహితంగా మెలిగిన నాగ్.. బాలయ్య చాలా ఏళ్ల నుంచి దూరం దూరం ఉంటున్నారు. కారణమేంటో కానీ.. వాళ్ల మధ్య ఒక దశలో తీవ్ర విభేదాలు వచ్చాయి.

అవి ఏ స్థాయికి చేరాయంటే ఏఎన్నార్ చనిపోతే చివరి చూపుకు కూడా బాలయ్య రానంత. ఆ తర్వాత నాగ్.. బాలయ్య మరింతగా దూరం పాటించారు. మధ్యలో సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన ఒక ఈవెంట్లో తమ మధ్య విభేదాలేమీ లేవంటూ మీడియా మీదికి నెపం నెట్టేశారు ఇద్దరూ. కానీ ఆ తర్వాత షరా మామూలే. దూరం దూరంగానే ఉంటున్నారు. సంబంధాలేమీ మెరుగు పడ్డట్లు లేవు. ఈ నేపథ్యంలో బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’లో సుమంత్ ఏఎన్నార్ పాత్ర చేయడానికి నాగ్ అనుమతి లభించిందా లేదన్న చర్చ నడుస్తోంది. నిజానికి ‘మహానటి’లో ఏఎన్నార్ పాత్ర చేసిన నాగచైతన్యతోనే ఇక్కడా ఆ పాత్ర చేయించొచ్చు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్‌నే నటింపజేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐతే నాగార్జునతో విభేదాల వల్లే చైతూను బాలయ్య ఈ పాత్రకు అడగలేదని అంటున్నారు. మరి నాగార్జునతో సంబంధం లేకుండానే సుమంత్ ను సంప్రదించి.. అతడిని ఈ పాత్రకు ఒప్పించారా.. సుమంత్ తన మావయ్యను అడక్కుండానే ఈ పాత్రను ఒప్పుకున్నాడా అన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి సుమంత్ ను ఈ పాత్రకు ఒప్పించే క్రమంలో ఏం జరిగిందో?