Begin typing your search above and press return to search.

సుమంత్ కొత్త సినిమా.. మళ్లీ రావా

By:  Tupaki Desk   |   18 July 2017 11:13 AM GMT
సుమంత్ కొత్త సినిమా.. మళ్లీ రావా
X
అక్కినేని లాంటి పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాని హీరో సుమంత్. సత్యం.. గోదావరి లాంటి ఒకట్రెండు హిట్లు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకుని హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు సుమంత్. చివరగా అతను చేసిన ‘నరుడా డోనరుడా’ కూడా తీవ్రంగా నిరాశ పరచడంతో సుమంత్ ఇప్పుడిప్పుడే మళ్లీ ఇంకో సినిమా చేయడని అంతా అనుకున్నారు. కానీ సుమంత్ ఈసారి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా గౌతమ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేశాడు. చాలా తక్కువ సమయంలో చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఆ సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు సుమంత్.

ఈ చిత్రానికి ‘మళ్లీ రావా’ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలిపాడు సుమంత్. సినిమా మొదలయ్యేటపుడే టైటిల్ ఫిక్స్ చేశామని.. ఐతే ఇప్పుడు తొలిసారి జనాలకు చెబుతన్నామని అన్నాడతను. ‘గోదావరి’ తర్వాత తాను చేసిన ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇదని సుమంత్ చెప్పాడు. హీరో 25 ఏళ్ల కాలంలో వివిధ వయసుల్లో కనిపిస్తాడని.. 13 ఏళ్లతో మొదలుపెట్టి 35 ఏళ్ల వరకు మూడు వేర్వేరు కాలాల్లో అతడి జీవితంలో జరిగిన పరిణామాలు ఇందులో చూపిస్తామని అన్నాడు సుమంత్. తాను వారానికి రెండు మూడు కథలు వింటుంటానని.. గౌతమ్ అలా ఓ సందర్భంలో చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశానని చెప్పాడు. తనకు కథ చెప్పేటపుడే రెండుంబావు గంటల పాటు సినిమా చూపించేశాడని.. చాలా బాగా కనెక్టయ్యానని.. కొన్ని చోట్ల కళ్ల్లలో నీళ్లు వచ్చేశాయని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సినిమా చేస్తున్నట్లు కన్ఫమ్ చేశానని.. కొత్త నిర్మాత రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడని సుమంత్ వెల్లడించాడు. ఆగస్టు తొలి వారంలో టీజర్ రిలీజవుతుందని.. తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నాడు సుమంత్.