Begin typing your search above and press return to search.

సమ్మర్ ఫైట్ చాలా హాట్ గురు

By:  Tupaki Desk   |   25 Jan 2018 6:30 PM GMT
సమ్మర్ ఫైట్ చాలా హాట్ గురు
X
2018 ఓపెనింగ్ టాలీవుడ్ కు అంత శుభకరంగా ప్రారంభం కాలేదు కాని రానున్న రోజుల్లో సినిమా ప్రేమికులకు పెద్ద పండగే ఉంది. రేపు భాగమతి విడుదలతో మొదలయ్యే హంగామా వచ్చే వారం రవితేజ టచ్ చేసి చూడుతో  కంటిన్యూ అవుతూ ఆపై వారం ఇంటెలిజెంట్, తొలిప్రేమ, గాయత్రి సినిమాలతో పీక్స్ కు చేరుకుంటుంది. ఇందులో ఎవరు విన్నర్ ఎవరు ఎక్కువ వసూళ్లు రాబడతారు అనేది ఇప్పుడు తేలేది కాదు కాని మూవీ లవర్స్ మాత్రం పర్సుకు బాగా పని చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వేసవి కాలం సినిమాలు స్టార్ హీరోల మధ్య పోటీతో కత్తులు కాళ్ళకు కట్టుకున్న కోడి పుంజుల పందేలను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికీ విడుదల తేదీల విషయంలో పూర్తి క్లారిటీ లేకపోయినా అటుఇటు ఓ వారం ముందు వెనుక సినిమాలు క్యు కట్టడం మాత్రం ఖాయం.

వేసవి తొలి సీజన్ ని రామ్ చరణ్ ఓపెన్ చేయబోతున్నాడు. రంగస్థలంపై అంచనాలు మామూలుగా లేవు. మార్చ్ 30 విడుదల తేది ఖరారు అయినట్టే. నిన్న విడుదల చేసిన టీజర్ ఇప్పటికే ఉన్న హైప్ ని రెట్టింపు చేసింది. ముందు రోజు మహానటి షెడ్యూల్ చేసారు కాని సిజి వర్క్ ఇంకా బాలన్స్ ఉన్న కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ కు ధీటుగా ఓపెనింగ్స్ తెచ్చే స్టార్ హీరో అందులో లేరు కాని దాని మీద బజ్ మాత్రం చాలా ఉంది. ఒకవేళ రంగస్థలం హిట్ అయితే కనక దాని ప్రభావం చాలా సానుకూలంగా ఆ తర్వాత రానున్న సినిమాలపై పడుతుంది.

ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య కోసం ఎన్నడు లేనిదీ నాలుగు నెలల ముందు నుంచే యాక్టివ్ ప్రమోషన్ చేయటం ఆసక్తికరంగా మారింది. టీజర్ ఇప్పటికే విడుదలై పోగా టైటిల్ సాంగ్ ని రేపు రిలీజ్ చేస్తున్నారు. వచ్చే 14న ఒక డ్యూయెట్ సాంగ్ కూడా వదలబోతున్నారు. మహేష్ బాబు ప్రమాణ స్వీకారం రూపంలో భరత్ అను నేను రేపటి నుంచే ప్రమోషన్ మొదలు పెట్టుకుంటోంది. ఇప్పటి దాకా ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వని యూనిట్ ఇకపై ఫుల్ స్వింగ్ లో ఒక ప్రణాళిక ప్రకారం చేయబోతున్నారు. భరత్ అను నేను - నా పేరు సూర్య క్లాష్ అవ్వడం గురించి వార్తలు ఉన్నాయి కాని అలా జరిగే అవకాశం లేనట్టే. నా పేరు సూర్య ఏప్రిల్ 13కే తేవాలా లేక ముందు అనుకున్న ఏప్రిల్ 27కు ఫిక్స్ అవ్వాలా అనే దాని గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు.

భరత్ అను నేను మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ గురించి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. రేపు ఓత్ తో పాటు విడుదల తేది ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తేది ఏదైనా ఏప్రిల్ లోనే ఉంటుంది అనేది సుస్పష్టం. 2.0 విషయంలో ఇంకా సందిగ్దత నెలకొని ఉంది. ఏప్రిల్ లో రావడం అనుమానమే అని కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. సైలెంట్ కిల్లర్ నాని కూడా రేస్ లో ఉన్నాడు. డ్యూయల్ రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ నే టార్గెట్ చేసుకుంది. ఇది వెనక్కు తగ్గే ఆలోచనలో లేదు కాని డేట్ గురించి ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి సమ్మర్ స్టార్ వార్స్ బాక్స్ ఆఫీస్ ను ప్రతి వారం సందడి సందడి చేయనుండటం మాత్రం ఖాయం.ఒకళ్ళతో ఒకరు తలపడటం లేదు కాని ప్రతి శుక్రవారం మూవీ లవర్స్ థియేటర్లో అటెండెన్స్ వేయించుకునే పరిస్థితి మాత్రం తప్పదు.