Begin typing your search above and press return to search.

ట్రాక్ రికార్డు అలా ఉన్నా..ఇన్ని అవకాశాలా?

By:  Tupaki Desk   |   2 Jun 2017 10:10 AM GMT
ట్రాక్ రికార్డు అలా ఉన్నా..ఇన్ని అవకాశాలా?
X
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో చెప్పుకోవడానికి ఏకైక నిఖార్సయిన హిట్టు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. ఆ సినిమా తర్వాత సందీప్ మంచి స్థాయికి చేరుకుంటాడని అనుకున్నారంతా. కానీ తర్వాత వచ్చిన సినిమాలేవీ సందీప్ కు మంచి ఫలితాన్నివ్వలేదు. రెండేళ్ల కిందట వచ్చిన ‘టైగర్’ ఓ మోస్తరుగా ఆడింది కానీ.. గత ఏడాది ‘రన్’.. ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలు అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ ‘నగరం’ కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ చిత్రం తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఐతే సందీప్ కు హిట్లు లేకపోయినా.. అవకాశాలకు మాత్రం కొదవ లేకపోవడం విశేషం. ఒకదాని వెంట ఒకటి అతడికి సినిమాలు వస్తూనే ఉండటం షాకింగే. అవకాశాలు రావడమే ఒకెత్తయితే.. అవి అరుదైనవి కావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.

తెలుగులో ‘నక్షత్రం’తో పాటు ‘శమంతకమణి’ విడుదలకు సిద్ధమవుతుండగా.. తమిళంలో సందీప్ నటించిన ‘మాయవన్’ కూడా పూర్తయింది. వీటి సంగతలా ఉంటే ఇటీవలే మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అతడి తలుపు తట్టాయి. మహేష్ బాబు సోదరి మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న సినిమాలో సందీప్ నే కథానాయకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో తమన్నాతో చేయాలనుకున్న సినిమాలోనూ సందీప్ కు ఓ కీలక పాత్ర ఇచ్చాడు. మరోవైపు నాగచైతన్య చేయాల్సిన ద్విభాషా చిత్రం సందీప్ చేతికే చిక్కింది. ‘16’ పేరుతో తెలుగులోకి డబ్ అయిన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సందీప్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ అతడికి ఇంత మంచి అవకాశాలు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు జనాలకు. సందీప్ మావయ్య ఛోటా కే నాయుడు ఇలా అన్ని ఇండస్ట్రీల్లో లాబీయింగ్ చేసి అవకాశాలు ఇప్పిస్తున్నాడా అంటే సందేహమే. మరి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సందీప్ ఇన్ని అవకాశాలు ఎలా దక్కుతున్నాయో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/