Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?

By:  Tupaki Desk   |   7 Nov 2017 3:30 PM GMT
సందీప్ కిషన్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు?
X
‘‘నా పేరు సందీప్ కిషన్. మా నాన్న పేరు రవిప్రకాష్ నాయుడు. మా అమ్మ పేరు కనకదుర్గ. నేను పక్కా తెలుగువాడిని’’ అంటూ సందీప్ కిషన్ తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చింది ‘కేరాఫ్ సూర్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కేరాఫ్ సూర్య’ సినిమాను డబ్బింగ్ సినిమాగా భావిస్తున్నారట జనాలు. కానీ ఇది అచ్చ తెలుగు సినిమా అని.. దీంతో పాటుగా తమిళంలోనూ ఈ సినిమాను తెరకెక్కించామని.. ఓ తమిళ దర్శకుడు వచ్చి తెలుగులో సినిమా చేసినంత మాత్రాన దాన్ని తమిళ సినిమా అనడం కరెక్ట్ కాదని.. ఈ చిత్ర హీరోగా తాను.. నిర్మాత చక్రి చిగురుపాటి తెలుగు వాళ్లని.. ఇది తెలుగు సినిమా అని అన్నాడు సందీప్ కిషన్.

తమిళ కథానాయకులు తెలుగులో మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకుంటున్నారని.. అలాంటపుడు మనం వేరే భాషలకు వెళ్లి సినిమాలు చేస్తే తప్పేంటని అన్నాడు సందీప్. ఈ క్రమంలోనే ద్విభాషా చిత్రాలు చేస్తున్నానని.. అంతే తప్ప తెలుగుకు దూరం కాలేదని.. తనను పరాయివాడిని చేయొద్దని సందీప్ అన్నాడు. తాను ఇంతకుముందు చేసిన ‘నగరం’ తమిళ సినిమా అని.. దీన్ని ద్విభాషా చిత్రంగా చెప్పమని నిర్మాత అన్నా తాను అంగీకరించలేదని.. డబ్బింగ్ సినిమా అనే అన్నానని.. ‘కేరాఫ్ సూర్య’ మాత్రం అలా కాదని అన్నాడు సందీప్. ‘కేరాఫ్ సూర్య’ సినిమాకు హైదరాబాద్ కూకట్ పల్లిలో ఫేమస్ అయిన మల్లికార్జున థియేటర్ కేటాయించడంపై ‘ఒక్కడు మిగిలాడు’ టీం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీన్నో డబ్బింగ్ సినిమాగా అభివర్ణించిన నేపథ్యంలో సందీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.