Begin typing your search above and press return to search.

ఇక శంకర్ సినిమానే రక్ష .. రక్ష!

By:  Tupaki Desk   |   24 Dec 2021 1:41 PM GMT
ఇక శంకర్ సినిమానే రక్ష .. రక్ష!
X
అందరినీ ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన 'పుష్ప' సినిమా మొత్తానికి ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను, మైత్రీ మూవీస్ వారు నిర్మించారు. ఈ కథ అడవి నేపథ్యంలో నడుస్తుంది. అందువలన కథా నేపథ్యాన్ని బట్టి సుకుమార్ ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన లుక్ ను సెట్ చేస్తూ వెళ్లాడు. అలాంటి పాత్రల్లో సునీల్ పోషించిన 'మంగళం శీను' పాత్ర ఒకటి. సునీల్ లుక్ బయటికి వచ్చినప్పుడు, ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడే అనుకున్నారు.

సునీల్ లుక్ బాగుంది .. ఆయన బాడీ లాంగ్వేజ్ కొత్తగా కనిపిస్తోంది. అందువలన ఈ సినిమా తరువాత ఆయనకి మంచి పేరు రావొచ్చని అనుకున్నారు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఈ సినిమా విడుదలైన తరువాత 'మంగళం శీను' గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సునీల్ పాత్ర నుంచి ఆశించిన స్థాయి అవుట్ పుట్ ను రాబట్టలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక అనసూయ పాత్ర విషయంలోను ఇంచుమించు ఇదే టాక్ వినిపించింది. ఈ ఇద్దరినీ కాదని 'కేశవ' పాత్రకి ఎక్కువ మార్కులు పడటం ఇక్కడి విశేషం.

ఈ సినిమాతో తనకి మరింత మంచి పేరు వస్తుందని భావించిన సునీల్ కి ఒక రకంగా నిరాశే ఎదురైంది. ఒక మంచి ప్రయత్నానికి తగిన ఆదరణ దక్కకపోతే సహజంగానే అసంతృప్తి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన ఆశలన్నీ శంకర్ సినిమాపైనే ఉన్నట్టుగా తెలుస్తోంది. చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది.

అయితే శంకర్ సినిమాకి సునీల్ ను దిల్ రాజు సిఫార్స్ చేశాడట. ఇంతకుముందు సునీల్ చేసిన కొన్ని పాత్రలను చూసిన తరువాతనే శంకర్ ఆయనకి ఆ పాత్రను ఇచ్చాడని అంటున్నారు. ఒక రకంగా ఇది కీ రోల్ అనీ .. ఈ పాత్ర తనని మరో మెట్టుపైకి చేరుస్తుందనే నమ్మకంతో సునీల్ ఉన్నాడు. శంకర్ సినిమాలో అవకాశం లభించడమే అదృష్టం.

ఇక అనుకున్నట్టుగా సునీల్ కేరక్టర్ కి మంచి పేరు వస్తే ఓకే. కొత్తగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకసారి ఫైర్ కావడం .. మరోసారి మిస్ ఫైర్ కావడం సహజం. ప్రస్తుతం సునీల్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. విలక్షణమైన నటుడు అనిపించుకోవాలనే ఈ ప్రయత్నంలో ఆయన కొంతవరకూ సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పచ్చు.