Begin typing your search above and press return to search.

సునీల్.. ఈ కమెడియన్ని చూడమ్మా!

By:  Tupaki Desk   |   20 Aug 2017 10:13 AM GMT
సునీల్.. ఈ కమెడియన్ని చూడమ్మా!
X
కమెడియన్ గా ఉన్నపుడు సునీల్ స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. అతను రైజింగ్ లో ఉన్నపుడు బ్రహ్మానందం కూడా తన కంటే తక్కువ స్థాయిలోనే ఉండేవాడు. టాలీవుడ్లో ఒక రోజుకు కొన్ని లక్షలు పారితోషకంగా తీసుకునే రేంజికి ఎదిగిన తొలి కమెడియన్ సునీలే. అతను కొంచెం తగ్గాకే బ్రహ్మి మళ్లీ రైజింగ్ లోకి వచ్చాడు. సునీల్ కన్నా ఎక్కువ పారితోషకం తీసుకున్నాడు.

ఐతే కమెడియన్ గా బ్రహ్మాండంగా సాగుతున్న కెరీర్ ను పక్కనపెట్టేసి సునీల్ హీరో వేషాలు వేయడం బ్రహ్మికి కలిసొచ్చింది. హీరోగా కెరీర్ ఆరంభంలో రెండు మూడు హిట్లు కొట్టేసరికి సునీల్ తన గురించి తాను ఏదో ఊహించున్నాడు. తనకు సూటయ్యే కామెడీ టచ్ ఉన్న వేషాలు వదిలేసి మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయ పడి కెరీర్ చెడగొట్టుకున్నాడు. హీరోగా కెరీర్ దెబ్బ తింది. కమెడియన్ గా కెరీర్ కు తెరపడింది. ఇప్పుడు రెంటికీ చెడ్డ స్థితిలో క్రాస్ రోడ్స్ లో నిలుచున్నాడు సునీల్.

సునీల్ తర్వాత మరికొందరు కమెడియన్లు కూడా హీరోలయ్యారు. వారిలో శ్రీనివాసరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన తొలి సినిమా ‘గీతాంజలి’ అయినా.. రెండో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అయినా.. తాజాగా వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ అయినా.. కథ బలంగా ఉన్న సినిమాలు. వేటిలో కూడా ‘హీరోయిజం’ మచ్చుకైనా కనిపించదు.

ఈ మూడు సినిమాలూ తెరమీదికి రావడంతో శ్రీనివాసరెడ్డిది కీలక పాత్ర. ఆయా సినిమాలకు అన్నీ సమకూర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ దర్శకులతో అతడికి మంచి సంబంధాలున్నాయి. అలా అని తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యముండాలని.. తనే హైలైట్ కావాలని.. ఇంట్రో సాంగ్స్ కావాలని.. ఫైట్లు ఉండాలని.. ఇలా ఏ షరతులు పెట్టకపోవడం గొప్ప విషయం. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో పూర్తి స్థాయి హీరోగా నటించినా కూడా అతను ఎక్కడా అతి చేయలేదు. రెచ్చిపోలేదు. కథతో పాటే ట్రావెల్ చేశాడు. సినిమాలో ఒక పాత్రధారిలాగే కనిపించాడు.

‘ఆనందో బ్రహ్మ’లోనూ అంతే. ముఖ్య పాత్రధారుల్లో అతనొకడు. తన స్థాయి ఏంటో తెలుసుకుని.. చక్కటి అభిరుచితో.. ఆలోచనతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు శ్రీనివాసరెడ్డి. అదే సమయంలో కామెడీ వేషాలు కూడా వదులుకోలేదు. శ్రీనివాసరెడ్డితో పోలిస్తే సునీల్ రేంజి ఎక్కువే కావచ్చు. కానీ అతడి నుంచి సునీల్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సునీల్ మాత్రమే కాదు.. హీరోలుగా వెలిగిపోవాలనుకునే స్టార్ కమెడియన్లందరూ కూడా శ్రీనివాసరెడ్డి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే.