Begin typing your search above and press return to search.

సునీల్ మీద తలకు మించిన భారమే

By:  Tupaki Desk   |   18 Feb 2016 9:36 AM GMT
సునీల్ మీద తలకు మించిన భారమే
X
ప్రతి హీరోకూ ఒక రేంజ్ అని.. ఒక మార్కెట్ అని ఉంటుంది. దానికి మించిపోయి సినిమాలు తీస్తే చాలా ప్రమాదం. కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ ఇప్పుడు ఆ ప్రమాదంలోనే ఉన్నట్లున్నాడు. అతడి కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ మీద నిర్మాత దిల్ రాజు చాలా పెద్ద బడ్జెట్టే పెట్టేసినట్లు సమాచారం. ఆ మొత్తం దాదాపు రూ.25 కోట్ల దాకా ఉంటుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఫిగర్ ఎంత అని వెల్లడించలేదు కానీ.. ఈ సినిమాకు చాలా పెద్ద మొత్తమే ఖర్చు పెట్టినట్లు దిల్ రాజే స్వయంగా చెబుతున్నాడు. ఎన్టీఆర్ సినిమా ‘బృందావనం’, ప్రభాస్ మూవీ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’లకు ఆ రోజుల్లో పెట్టిన బడ్జెట్ కంటే ఇప్పుడు ‘కృష్ణాష్టమి’కి పెట్టిన బడ్జెట్ ఎక్కువని దిల్ రాజు చెప్పడం విశేషం.

‘‘కృష్ణాష్టమి బన్నీ కోసం తయారు చేసిన కథ. ఐతే సునీల్‌ చేస్తున్నాడని ఎక్కడా హీరోయిజం తగ్గించలేదు. సినిమాకు ఖర్చు కూడా తగ్గించలేదు. బడ్జెట్‌ విషయానికి వస్తే బృందావనం - మిష్టర్‌ ఫర్‌ ఫెక్ట్‌ సినిమాల‌కు ఆ రోజుల్లో పెట్టిన బడ్జెట్‌ కంటే ఎక్కువగానే పెట్టాం. ఈ సినిమాను 45 రోజులు ఫారిన్‌ లోనే షూట్‌ చేశాం. ఐతే కాలాన్ని, పరిస్థితుల‌ను బట్టి బడ్జెట్‌ చూడలేం. సినిమాను బట్టి బడ్జెట్ మారుతుంది. ‘కృష్ణాష్టమి’కి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టాం. సినిమా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం కాబట్టి.. ఆ బడ్జెట్ కంటే ఎక్కువే తిరిగి తెస్తుందని నమ్మకముంది’’ అని చెప్పాడు రాజు. మరి కృష్ణాష్టమి సినిమా లాభాల్లోకి రావాలంటే.. సునీల్ కెరీర్ లో బిగ్జెస్ట్ హిట్ అయిన ‘పూల రంగడు’ కంటే ఎక్కువే వసూలు చేయాలి. మరి ఇంత భారాన్ని సునీల్ ఎలా మోస్తాడో చూడాలి.