Begin typing your search above and press return to search.

ఎంత త్యాగం చేశానో అంటున్న సునీల్

By:  Tupaki Desk   |   14 Feb 2016 1:30 PM GMT
ఎంత త్యాగం చేశానో అంటున్న సునీల్
X
కమెడియన్ సునీల్ హీరో వేషాల్లోకి మారిపోయి.. వాటికే ఫిక్సయిపోవడం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అతణ్ని కమెడియన్ గానే చూడాలని ఇష్టపడేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. సునీల్ సిక్స్ ప్యాక్ చేయడం.. హీరోయిజం చూపించడం మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని సునీల్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ఒక సినిమా కోసం దర్శకుడు సిక్స్ ప్యాక్ చేయంటే చేశా. అది బాగుందని మిగతా దర్శకులు కూడా ఎంకరేజ్ చేయడంతో అప్పుడప్పుడు సిక్స్ ప్యాక్‌ కు మారి... మళ్లీ కొంచెం బరువు పెరగాల్సి వస్తోంది. నాకు తిండి అంటే ప్రాణం. కానీ, సిక్స్ ప్యాక్ కోసం త్యాగం చేశా. నేనెంత తిండి ప్రియుణ్ణో మావాళ్లకు తెలుసు. అందుకే నా త్యాగం చూసి, బాధపడతారు. సినిమా కోసమే ఏదైనా చేస్తున్నా. ఏదైనా నా అంతట నేను చేయట్లేదు. దర్శకులు అడిగితే చేస్తున్నా’’ అని చెప్పాడు సునీల్.

ఇక హీరోగా కెరీర్.. రెస్పాన్సిబిలిటీ గురించి చెబుతూ.. ‘‘హీరోగా చేస్తూ కమెడియన్ గా మంచి లైఫ్ పోగొట్టుకుంటున్నాడని కొందరు అనడం విన్నాను. ఐతే నేనిక్కడకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇక పోగొట్టుకుంటానని టెన్షన్ ఎందుకు? ఇక హీరోగా సినిమా బాధ్యత మొత్తాన్ని మోసే సామర్థ్యం నాకు లేదు. ఆ ఒత్తిడిని తట్టుకునే ఓపిక లేదు. నాకు బ్యాగ్రౌండ్ లేదు. అందుకని ఏం జరుగుతుందో.. ఏంటో అని విపరీతంగా ఆలోచించేవాణ్ణి. ఆ ఒత్తిడి వల్లే డల్ అయిపోయాను. ఆ ప్రభావం నటన మీద పడుతోంది. దాంతో.. దేవుడా.. భారం నీదే. నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నా. ఆ తర్వాత ఆలోచించడం మానేశా’’ అని చెప్పాడు సునీల్. తన కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’ కథ అల్లు అర్జున్ కోసం తయారు చేసిందేనని చెప్పిన సునీల్.. తనతో అనుకున్నాక కొన్ని మార్పులు చేశారని వెల్లడించాడు.