Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బయోపిక్ రియలిస్టిక్ గా ఉందే

By:  Tupaki Desk   |   4 Jun 2019 10:59 AM GMT
ట్రైలర్ టాక్: బయోపిక్ రియలిస్టిక్ గా ఉందే
X
బాలీవోడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా 'క్వీన్' ఫేమ్ వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూపర్ 30'. ప్రముఖ గణితవేత్త.. సూపర్ 30 ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ప్రతిభ కల పేద విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం సాధించేందుకు ట్రైనింగ్ ఇచ్చిన ఆనంద్ కుమార్ బయోపిక్ ఇది. ఎన్నో కార్పోరేట్ కంపెనీల ఆఫర్లు..విదేశాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా అవన్నీ వదులుకొని ఒక ఆశయంకోసం పాట్నాలోనే ఉండిపోయిన ఒక వ్యక్తి అద్భుత కథ ఇది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది.

మ్యాథమెటిషియన్ అయిన ఆనంద్ కుమార్ టాలెంట్ గురించి తెలుసుకొని ఆయనను ట్రైనర్ గా పెట్టుకుని ఒక బిజినెస్ మ్యాన్ ఐఐటీ-జెఈఈ కోచింగ్ మొదలుపెడతారు. అయితే అదంతా.. భారీ ఫీజులు.. డబ్బున్నవారి కోసం అన్నట్టు ఉంటుంది. దీంతో ఆనంద్ కుమార్ దాన్ని వదిలేసి ప్రతిభ ఉండి ఐఐటీ కోచింగ్ కు డబ్బు కట్టలేని పేద విద్యార్థులకోసం స్వయంగా కోచింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. అంతవరకూ మాత్రం ట్రైలర్ లో చూపించారు. మరి తను అనుకున్నది సాధించాడా? అందులో ఎలాంటి ఇబ్బందులు ఎందురయ్యాయి అన్నది కథ.

హృతిక్ అంటేనే గ్రీక్ గాడ్. ఆ స్టైల్.. యాటిట్యూడ్ కు వంక పెట్టలేం. అయితే ఈ సినిమాలో ఆనంద్ కుమార్ పాత్ర కోసం హృతిక్ పూర్తిగా డీగ్లామర్ లుక్ లో కనిపించాడు. ట్రైలర్ ఆద్యంతం అసలు హృతిక్ ను చూస్తున్నట్టుగా అనిపించదు. ఆనంద్ కుమార్ ను చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మేకోవర్ మాత్రమే కాదు. బిహారీ యాసలో పలికే హిందీ డైలాగ్స్ కూడా మనల్ని ఏకంగా పాట్నా గల్లీల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాయి. హృతిక్ పాత్ర చివర్లో చెప్పే "ఆజ్ రాజా కా బేటా రాజా నహీ బనేగా.. రాజా వహీ బనేగా జో హక్ దార్ హోగా"(ఈ కాలంలో రాజు కొడుకు రాజు అవ్వడు.. ఎవరికి అర్హత ఉందో వారే రాజు అవుతారు) సూపర్. మళ్ళీ చాలారోజుల తర్వాత హృతిక్ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాను ఎంచుకున్నాడనిపిస్తోంది. ట్రైలర్ లో విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు 'సూపర్ 30' ట్రైలర్ ను చూసేయండి.