Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌

By:  Tupaki Desk   |   4 July 2015 8:50 AM GMT
సినిమా రివ్యూ :  సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌
X
రివ్యూ: సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌
రేటింగ్‌: 2.5 /5
తారాగణం: నందు, ఆదర్శ్‌, భూపాల్‌, వెన్నెల కిశోర్‌, ముక్తార్‌ఖాన్‌, తాగుబోతు రమేష్‌, పోసాని, ఫిష్‌ వెంకట్‌, శ్రద్ధాదాస్‌, పూనమ్‌ కౌర్‌ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్‌
నిర్మాత: చందు పెనుమత్స
దర్శకత్వం: సుశాంత్‌రెడ్డి

తెలుగులో తిరుగులేని క్రేజ్‌ ఉన్న హీరోల్లో మహేష్‌ బాబు ఒకడు. మహేష్‌ పేరు వాడుకుని గతంలో అష్టాచెమ్మా లాంటి మంచి సినిమా తీశాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇప్పుడు ఏకంగా మహేష్‌ బమ్మ వాడేసుకుని సినిమా తీసేశాడు కొత్త దర్శకుడు సుశాంత్‌ రెడ్డి. మహేష్‌ను కిడ్నాప్‌ చేసే కథాంశంతో అతను తీసిన సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రోమోలతో బాగానే ఆసక్తి రేపిన ఈ సినిమా తెరమీద ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ:
నందు, పూనమ్‌ ఇద్దరూ ప్రేమికులు. అయితే పూనమ్‌కి స్వచ్ఛమైన ప్రేమా దోమా అంటే నచ్చదు. ఏదో ప్రేమించుకున్నామా? అవసరాలు తీర్చుకున్నామా? వెళ్లిపోయామా? అనుకునే టైపు. ఇది నందుకు నచ్చదు. దాంతో ఇద్దరూ విడిపోతారు. పూనమ్‌ మాత్రం యథావిధిగా మరో బాయ్‌ ఫ్రెండ్‌ ఆదర్శ్‌కు వలేస్తుంది. అతను బాగా డబ్బున్నోడు. అమ్మాయిలను వాడుకుని వదిలేస్తుంటాడు. ఇక భూపాల్‌.. సూపర్‌ స్టార్‌ మహేష్‌కు కథ చెప్పి సినిమాను డైరెక్ట్‌ చేయాలనే లక్ష్యంతో తిరుగుతుంటాడు. నిర్మాత కుమారుడైన ఆదర్శ్‌... మహేష్‌తో సినిమా చేసే అవకాశం కల్పిస్తానని చెప్పడంతో అతడి వెంటే తిరుగుతుంటాడు. నందు, ఆదర్శ్‌, భూపాల్‌ కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం సూపర్‌స్టార్‌ని కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేస్తారు. మరి వాళ్లు సూపర్‌స్టార్‌ని కిడ్నాప్‌ చేశారా? వాళ్లీ కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చివరకు వాళ్లేం సాధించారు? అన్నది తెరమీద చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ:
ఈ మధ్య టాలీవుడ్‌లో క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్స్‌ వరుస కడుతున్నాయి. అందులో కొన్ని విజయవంతమవుతుంటే.. కొన్ని బోల్తా కొడుతున్నాయి. సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌.. ఈ రెంటికి మధ్యన ఉండే సినిమా. ఈ కిడ్నాప్‌ డ్రామా గొప్ప కిక్కేమీ ఇవ్వదు. అలాగని నిరాశ పరచదు. ఏదో టైంపాస్‌కు ఓకే, నాట్‌ బ్యాడ్‌ అనిపించే సినిమా. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా సాగే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను దర్శకుడు కొంచెం వైవిధ్యం జోడించి.. చాలా వరకు ఆసక్తికరంగానే నడిపించాడు. ఇందులో మహేష్‌ నటించకపోయినా.. అతను నటించినంత భావన ప్రేక్షకులకు కలిగేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు.

సాధారణంగా కిడ్నాప్‌ స్టోరీ అనగానే.. డబ్బులు డిమాండ్‌ చేయడం, ఆ తరువాత పోలీసులకు పట్టుబడటం, చివర్లో ఏదో ఒక మెసేజ్‌ ఇవ్వడంలాంటి కథలను మనం చాలానే చూశాం. కానీ ఇందులో కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే దగ్గర నుంచి... ఆ కిడ్నాప్‌ నుంచి తప్పించుకుని బయట పడటానికి హీరోలు చేసిన ప్రయత్నాలపై దర్శకుడు స్క్రీన్‌ప్లేను బాగానే నడిపించాడు. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లేనే ప్రాణం. ఐతే ఇక్కడ ఓ సౌలభ్యం కూడా ఉంటుంది. ముగ్గురు కుర్రాళ్లను ఒక గోల్‌తో ఒకచోటికి చేర్చేముందు.. వాళ్ల పరిచయం, సమస్యలకు సంబంధించిన ట్రాక్‌లను ఆసక్తికరంగా నడిపించడానికి అవకాశముంటుంది. దర్శకుడు సుశాంత్‌ ఈ విషయంలో విజయవంతమయ్యాడు. ముగ్గురు కథానాయకులకు సంబంధించిన ట్రాక్‌లతో ప్రథమార్ధాన్ని చకచకా నడిపించాడు. ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరిగేలా ఇంటర్వెల్‌ బ్లాక్‌ ఇచ్చాడు.

ఐతే సెకండాఫ్‌లోనే కథనం అంత ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. పెద్దగా థ్రిల్‌ ఇవ్వలేకపోయాడు. కామెడీ మీదే బండి నడిపించడానికి ప్రయత్నించాడు. సెకండాఫ్‌ మొదట్లోనే ట్విస్టు రివీల్‌ అయిపోవడంతో ఆసక్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత రొటీన్‌ సన్నివేశాలతో సాగుతుంది కథనం. వెన్నెల కిషోర్‌ చేసిన కామెడీ మాత్రమే సెకండాఫ్‌లో చెప్పుకోదగ్గ విశేషం. సినిమా గ్రాఫ్‌ మరీ పడిపోకుండా చేయడంలో అతడి పాత్ర కీలకం. కమెడియన్‌ కం డైరెక్టర్‌ అంటూ... తన మీదనే బోల్డన్ని సార్లు పంచ్‌లు వేసుకున్నాడు. ''బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్స్‌ ఇచ్చిన పరమ చెత్త డైరెక్టర్‌ నువ్వే'' అంటూ వేరే వాళ్లతో కూడా పంచ్‌లు వేయించుకోవడం ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్‌ ముందు కన్ఫ్యూజింగ్‌ డ్రామాను నడిపించడంలో దర్శకుడు కొంచెం తడబడ్డట్లు కనిపిస్తుంది. నిడివి రెండు గంటలే ఉండటం ప్లస్సే అయినా.. కథనాన్ని ఇంకొంచెం వేగంగా నడిపి ఉండాల్సిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. పాటలు సినిమాకు అడ్డుగా నిలిచాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చివర్లో మంచు మనోజ్‌ ఎంట్రీ బాగానే ఉంది. నాని, అల్లరి నరేష్‌ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. లేడీ డాన్‌ శ్రద్ధా దాస్‌ క్యారెక్టర్‌ను దర్శకుడు బాగానే రాసుకున్నాడు. పోసాని నుంచి ఆశించిన స్థాయిలో పంచ్‌లు మిస్సయ్యాయి.

నటీనటులు:
దర్శకుడు స్క్రిప్టు కంటే కూడా నటీనటుల ఎంపికలో, వారి నుంచి మంచి పెర్ఫామెన్స్‌ రాబట్టుకోవడంలో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. నందు, ఆదర్శ్‌, భూపాల్‌.. ముగ్గురూ చాలా బాగా చేశారు. అందర్లోకి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లో ఆదర్శ్‌ ఎక్కువ ఆకట్టుకుంటాడు. డిఫరెంట్‌ ఎమోషన్స్‌ ఉన్న కన్నింగ్‌ క్యారెక్టర్‌లో అతను బాగా ఒదిగిపోయాడు. దర్శకుడవ్వాలని తపించే కుర్రాడి పాత్రలో భూపాల్‌ కూడా సహజంగా నటించాడు. నందుకు ఇది మరీ గుర్తుంచుకోదగ్గ రోల్‌ కాదు కానీ.. ఉన్నంతలో బాగానే చేశాడు. పూనమ్‌ కౌర్‌.. కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా.. సిన్సియర్‌గా నటించింది. వెన్నెల కిశోర్‌ సెకెండాఫ్‌ని తన భుజాల మీద నడిపించాడు. తనకే సొంతమైన కామెడీ టైమింగ్‌తో అతను అదరగొట్టాడు. శ్రద్ధాదాస్‌ లేడీ డాన్‌గా బాగానే చేసింది. కొన్ని చోట్ల ఆమె ఓవరాక్షన్‌ చేసింది. తాగుబోతు రమేష్‌ ఎప్పటి లాగే తన మార్కు డైలాగులతో కాసేపు నవ్వించాడు. పోసాని పెద్దగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక వర్గం:
సాయికార్తీక్‌ పాటల్లో పెద్దగా కిక్కు లేదు కానీ. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. బడ్జెట్‌ తక్కువే అయినా మంచి క్వాలిటీ ఉండేలా సన్నివేశాల్ని తెరకెక్కించాడు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. ఎడిటర్‌ సెకండాఫ్‌లో కొంచెం కత్తెరకు పని చెప్పాల్సింది. ఓవరాల్‌గా ఎడిటింగ్‌ బాగానే ఉంది. నిర్మాత అవసరానికి తగ్గట్లు ఖర్చుపెట్టాడు. దర్శకుడు సుశాంత్‌ రెడ్డి తనలో విషయం ఉందని ప్రూవ్‌ చేసుకున్నాడు. కాన్సెప్ట్‌ విషయంలో కొత్తగా ఆలోచించినా.. సన్నివేశాల విషయంలో కొత్తదనం చూపించలేకపోయాడు. ఓ కొత్త డైరెక్టర్‌ నుంచి ఇంకా ఫ్రెష్‌ ఆలోచనలు ఆశిస్తాం.

చివరిగా...
ఈ కిడ్నాప్‌ డ్రామా.. ఒక్కసారి చూడ్డానికి ఓకే.