Begin typing your search above and press return to search.

బుద్ధి లేదా... స్టార్‌ డైరెక్టర్ పై సూపర్ స్టార్‌ ఫ్యాన్స్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   22 Feb 2022 7:38 AM GMT
బుద్ధి లేదా... స్టార్‌ డైరెక్టర్ పై సూపర్ స్టార్‌ ఫ్యాన్స్ ఆగ్రహం
X
వెండి తెర.. బుల్లి తెర.. ఓటీటీ మూడు ప్లాట్‌ ఫామ్స్ లో గొప్పది వెండి తెర అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు వెండి తెరపై విడుదల అయితే ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలను వెండి తెరపై చూస్తూ ఉంటే ఆ థ్రిల్‌ వేరుగా ఉంటుంది. ఓటీటీ లో లేదా టీవీలో చూస్తే ఆ మజా రాదు అనేది సగటు సినీ అభిమాని అభిప్రాయం.

ఫిల్మ్‌ స్టార్స్ కూడా తమ సినిమాలను వెండి తెరపై విడుదల చేయాలి కాని ఓటీటీ లో విడుదల చేయాలని కోరుకోరు. అలా కోరుకున్నారు అంటే వారికి వారి సినిమా పై నమ్మకం లేదని భావించవచ్చు లేదంటే వారు కమర్షియల్‌ అయ్యి ఉంటారు అనుకోవచ్చు. మంచి బజ్ ఉన్న సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడంను ఏ ఒక్కరు ఒప్పుకోరు. కరోనా సమయంలో థియేటర్లు లేవు కనుక సరే అనుకున్నారు కాని ఇప్పుడు ఓటీటీ డైరెక్ట్‌ రిలీజ్ ను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

తమ అభిమాన హీరో సినిమాను ఖచ్చితంగా వెండి తెరపై చూడాలని ఆశపడుతున్నారు. వారి ఆశలు అడియాశలు చేస్తూ కొందరు స్టార్స్ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌ నటించిన సినిమాలు కొన్ని ఓటీటీ మార్గంలో వెళ్లడంను అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్ తో సినిమాను థియేటర్‌ లోనే విడుదల చేయాలి. కాని ఓటీటీ లో విడుదల చేయడం ఏంటీ అంటూ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

దృశ్యం 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ సమయంలోనే అభిమానులు వ్యతిరేకించారు. కాని ఆ సమయంలో థియేటర్ల సమస్య ఉంది.. కరోనా భయం కొనసాగుతుంది. కాని ఇప్పుడు ఆ భయం లేదు.. సమస్య అంతకన్నా లేదు. కనుక మోహన్ లాల్‌ నటించిన 12త్‌ మ్యాన్‌ సినిమా ను థియేటర్‌ రిలీజ్ చేస్తారని ప్రతి ఒక్కరు భావించారు. కాని అనూహ్యంగా ఆ సినిమా ను కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ మొత్తానికి ఈ సినిమాను అమ్మేశారని మలయాళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మీడియాలో కూడా ఇదే విషయమై కథనాలు వస్తున్నాయి. దృశ్యం రెండు భాగాలను మోహన్ లాల్‌ తో తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకు దర్శకుడు అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

దృశ్యం సినిమా రెండు పార్ట్‌ లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాంటి సినిమాలను అందించిన జీతూ జోసెఫ్‌ ఖచ్చితంగా 12త్ మ్యాన్ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించి ఉంటాడు. మోహన్ లాల్‌ కు మరో మంచి సినిమా గా ఇది నిలుస్తుందని అంతా భావిస్తూ థియేట్రికల్‌ స్క్రీనింగ్ కోసం ఎదురు చూస్తుంటే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలు అభిమానులకు కోపంను తెప్పిస్తున్నాయి. దాంతో మేకర్స్ కు బుద్ది లేదా ఒక మంచి సినిమాను థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ కాకుండా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు తీసుకు వెళ్లడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.