Begin typing your search above and press return to search.

నటశేఖరుడికి ఇక సెలవు..!

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:03 PM GMT
నటశేఖరుడికి ఇక సెలవు..!
X
లెజెండరీ నటుడు, నటశేఖర కృష్ణ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తనయుడు మహేశ్ బాబు తండ్రి చితికి నిప్పటించారు.

ఈరోజు బుధవారం మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానానికి కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. ఇందులో వేలాది సంఖ్యలో హాజరైన ప్రజలు, అభిమానులు పాల్గొని ఆయనకు అశ్రు నయనాలతో నీరాజనాలు పలికారు.

దారి పొడవునా సూపర్ స్టార్ అభిమానులు 'కృష్ణ అమర్ రహే' అంటూ నినాదాలు చేస్తూ కృష్ణ కు కన్నీటి వీడ్కోలు పలికారు. మహాప్రస్థానం చేరిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

అంతకుముందు అభిమానుల సందర్శనార్థం నానక్ రామ్ గూడ నివాసం నుంచి ఫిల్మ్ నగర్‌ లోని పద్మాలయ స్టూడియోకి కృష్ణ పార్థీవ దేహాన్ని తరలించారు. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు ప్రేక్షకులు మరియు సినీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

లెజెండరీ నటుడుకి తెలుగు ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రయాణంలో మూడొందలకు పైగా సినిమాలతో అలరించిన సూపర్ స్టార్ కృష్ణకు ఇక సెలవంటూ అందరూ కన్నీటి వీడ్కోలు పలికారు.

ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్‌ కు గురైన కృష్ణ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ లోకంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు దుఃఖం సాగరంలో మునిగిపోయారు. నటశేఖరుడు ఇక లేరు అనే వార్తను జీర్ణంచుకోలేకపోతున్నారు.

'తేనెమనసులు’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఘట్టమనేని కృష్ణ.. 350కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నటశేఖరుడిగా.. సూపర్ స్టార్‌ గా అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.

కృష్ణ చేయని పాత్ర లేదు.. ఆయన టచ్ చెయ్యని జోనర్ లేదు. చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక, నవలా చిత్రాలలో ఆయన నటించారు. గూఢచారి - కౌబాయ్ చిత్రాలని తెలుగు ఆడియెన్స్ కు అందించిన దిగ్గజ నటుడు.. టాలీవుడ్ కు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు.

కృష్ణ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి - నాగరత్నమ్మ దంపతులకు 1943మే 31న జన్మించారు. కృష్ణ మొదట ఇందిరా దేవిని వివాహం చేసుకోగా.. వీరికి 5 గురు సంతానం కలిగారు. చిన్న కొడుకు మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు.

కృష్ణ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాలలోనూ కొన్నేళ్ళు కీలక పాత్ర పోషించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారు. అయితే తన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడకపోవడంతో దూరమయ్యాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు. భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా పద్మ భూషణ్ తో సత్కరించింది.

ఏదేమైనా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా కృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో సంచలనాలకు.. మరెన్నో రికార్డులకు కేంద్రబిందువుగా నిలిచి డేటింగ్ అండ్ డాషింగ్ గా పిలువబడిన సూపర్ స్టార్ కృష్ణ మరణం తీరని లోటని చెప్పాలి. సినీ లోకం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.