Begin typing your search above and press return to search.

సాహసం ఊపిరి ఆగింది.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 1:28 AM GMT
సాహసం ఊపిరి ఆగింది.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత..!
X
తెలుగు సినిమా పరిశ్రమలో మరో నట శిఖరం నేలకొరిగింది.అశేష ప్రేక్షకులను విడిచి అనంతలోకాలకు వెళ్లారు. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 మంగళవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హార్ట్ స్ట్రోక్ వల్ల ఆ ఎఫెక్ట్ కిడ్నీలు, లంగ్స్ మీద కూడా పడటంతో ఆరోగ్యం బాగ విషమించిందని వైద్యులు వెళ్లడించారు. అప్పటికీ వెంటిలేటర్ మీద చికిత్స అందించినా సరే కృష్ణ గారిని కాపడలేకపోయారు.

1943 మే 31న కృష్ణ జన్మించారు. కృష్ణ గారి తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ. బుర్రిపాలెం నుంచి సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ వెళ్లారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమా తేనే మనసులు.. ఆ సినిమాతోనే ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. నాలుగు దశాబ్ధాల సినీ ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ 340కి పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అంటే అది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పొచ్చు. ఫస్ట్ సినీ స్కోప్.. ఫస్ట్ కలర్ ఫిల్మ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ ఇలా టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ పరిచయం చేసింది ఆయనే. ఒక ఏడాది దాదాపు 18 సినిమాలు చేసి ఏ హీరోకి సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ ఈమధ్యనే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి మృతిని కూడా జీర్ణించుకోలేకపోయారు. సెప్టెంబర్ 28న ఆమె తుది శ్వాస విడిచారు. అప్పటినుంచి కృష్ణ గారు మరింత క్రుంగిపోయినట్టు తెలుస్తుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా సరే.. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కృష్ణ గారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రెండు రోజులు డాక్టర్లంతా ఆయన్ను కాపాడటానికి ప్రయత్నాలు చేశారు. కానీ ట్రీట్ మెంట్ కి ఆయన సహకరించకపోవడంతో తుది శ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.