Begin typing your search above and press return to search.

మహేష్‌ సినిమాలకే ఎందుకిలా?

By:  Tupaki Desk   |   18 May 2022 12:30 AM GMT
మహేష్‌ సినిమాలకే ఎందుకిలా?
X
సూపర్ స్టార్ మహేష్ సినిమా రిలీజైందంటే చాలు.. కలెక్షన్ల గొడవ కామన్ అయిపోతోంది ఈ మధ్య. పెద్ద సినిమాలకు సంబంధించి నిర్మాతలు కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించడం, పెద్ద పెద్ద ఫిగర్లు వేసి పోస్టర్లు రిలీజ్ చేయడం కామనే. సినిమా బ్లాక్‌బస్టర్, మనం కూడా చూద్దాం అని జనాలను అనుకునేలా చేయడానికి నిర్మాతలు ఇలా చేస్తుంటారు. ఐతే మహేష్ సినిమాల విషయంలో ఇది మరీ శ్రుతి మించిపోతోందని.. వాస్తవ వసూళ్లకు, పోస్టర్ల మీద వేసే ఫిగర్లకు అసలు సంబంధం ఉండట్లేదనే చర్చ అంతకంతకూ పెరుగుతోంది.

కొన్నేళ్ల కిందట 'భరత్ అనే నేను' సినిమా వసూళ్ల విషయంలో పెద్ద రచ్చే జరిగింది. రిలీజ్ రోజు నుంచి డైలీ పోస్టర్లు వదలగా.. ప్రతి దాంట్లోనూ వసూళ్లు ఎక్కువ చేసి చూపించారన్నది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఆ నంబర్లు అంత అసహజంగా కనిపించాయి. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది, డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. అయినా సంతృప్తి చెందకుండా కలెక్షన్లను పెంచి చూపించడం పట్ల అంతా ఆశ్చర్యపోయారు.

ఐతే ఏదో ఒక నిర్మాణ సంస్థ ఇలా చేస్తే ఓకే కానీ.. మహేష్ ప్రతి సినిమాకూ ఇదే జరుగుతోంది. నిర్మాతలు మారినా ఈ కలెక్షన్ల రచ్చ మాత్రం ఆగట్లేదు. 'సరిలేరు నీకెవ్వరు' విషయంలోనూ ఈ ఒరవడి కొనసాగింది. ఓవైపు 'అల వైకుంఠపురములో' మహేష్ మూవీ మీద స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలుస్తున్నా, అది ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసినా.. ఆ సినిమా వసూళ్లను మించి దీనికి ఫిగర్లు వేశారు. ఆల్ టైం రికార్డ్ 'సరిలేరు నీకెవ్వరు'దే అని పోస్టర్లు వేశారు.

ఇప్పుడేమో 'సర్కారు వారి పాట'కు ట్రేడ్ అనలిస్టులు, బాక్సాఫీస్ వెబ్ సైట్లు ఇస్తున్న ఫిగర్లకు, చిత్ర నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేస్తున్న నంబర్లకు అసలు పొంతన ఉండట్లేదు. అసలు బాక్సాఫీస్ వెబ్ సైట్లే వసూళ్లను కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నాయనే చర్చ నడుస్తుండగా.. 'సర్కారు వారి పాట' పేరుతో నిర్మాతలు ఏర్పాటు చేసిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేస్తున్న పోస్టర్లలో నంబర్లయితే ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదు.

వాస్తవానికి ఈ సినిమా షేర్ రూ.80 కోట్లకు అటు ఇటుగా ఉంది. గ్రాస్ రూ.125 కోట్ల దాకా ఉండొచ్చంటున్నారు. కానీ నిర్మాతలు రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం రూ.160 కోట్ల గ్రాస్, రూ.100 కోట్ల షేర్ అని వేసేశారు. ఇలా నిర్మాతలు మారినప్పటికీ.. మహేష్ సినిమాలకు ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో సూపర్ స్టార్‌కు ఇంత కలెక్షన్ల మోజెందుకు అనే చర్చ నడుస్తోంది.