Begin typing your search above and press return to search.

#మీడియా స‌ర్వే: ఉత్త‌మ హీరోల జాబితాలో మ‌హేష్ నం.1

By:  Tupaki Desk   |   15 July 2021 5:51 AM GMT
#మీడియా స‌ర్వే: ఉత్త‌మ హీరోల జాబితాలో మ‌హేష్ నం.1
X
టైమ్స్ ఉత్తమ సెల‌బ్రిటీ జాబితాలు ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే ముంబైకి చెందిన ప్ర‌ముఖ ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు మేల్ స్టార్స్ జాబితాలో మహేష్ బాబు ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పాపుల‌ర్ తెలుగు హీరోల జాబితాలో మ‌హేష్ నంబ‌ర్ 1 స్థానాన్ని అలంక‌రించ‌గా ఆ త‌ర్వాతి స్థానాల్లో అల్లు అర్జున్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. అస‌లు ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయ‌క‌పోయినా మ‌హేష్ టాప్ 1గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఏడాది కాలంగా పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో బ‌న్ని ట్రెండీ టాపిక్ అయ్యారు. అల వైకుంఠ‌పుర‌ములో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అత‌డు న‌టిస్తున్న పుష్ప‌కి జాతీయ స్థాయి లో ప్ర‌చారం సాగుతోంది. ఓర్మాక్స్ జాబితాలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి పది జాబితాలో డార్లింగ్ ప్రభాస్- జూనియర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్- నైజాం ఎన‌ర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ- నేచుర‌ల్ స్టార్ నాని- మెగాస్టార్ చిరంజీవి- మాస్ మ‌హారాజా రవితేజ ఉన్నారు.

నిజానికి ఓర్మాక్స్ గత ఏడాది విడుదల చేసిన జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని అలంక‌రించ‌గా.. మహేష్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. 2021 లో ఈ పేర్లు అటూ ఇటూ తారుమార‌య్యాయి. ఆస‌క్తిక‌రంగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్లు ట్రెండింగ్ అవ్వ‌డం మెగాభిమానుల్లో చ‌ర్చ‌కు వచ్చింది. ప‌వ‌న్ ఓవైపు జ‌నసేన పార్టీ కార్య‌కలాపాల‌తో బిజీగా ఉండ‌గా.. చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత ఆచార్య కోసం చాలా స‌మ‌యం తీసుకుంటున్నారు. మ‌రోవైపు సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ బిజీగా ఉన్నారు. క‌రోనా క్రైసిస్ కాలంలో గూగుల్ లో ఎక్కువ ట్రెండ అయిన పేరు మెగాస్టార్ చిరంజీవి. కార‌ణం ఏదైనా చిరు-ప‌వ‌న్ ఇద్ద‌రి పేర్లు ఈ జాబితాలో టాప్ లో నిల‌వ‌డం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ కూడా అత‌డిని ట్రెండింగ్ లో నిల‌బెట్టింద‌ని చెప్పాలి. అలాగే ప‌రిశ్ర‌మ సీనియ‌ర్ల‌లో చిరంజీవి కి మాత్ర‌మే ఈ జాబితాలో చోటు ద‌క్క‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇక తాజా జాబితాను ప‌రిశీలిస్తే మ‌హేష్‌.. అల్లు అర్జున్ ఆల్వేస్ ట్రెండీ హీరోలు అన‌డంలో సందేహం లేదు. అయితే ఈసారి జాబితాలో గ‌త జాబితాలో ఉన్న వెంక‌టేష్ పేరు క‌నిపించ‌లేదు. రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్నా కానీ ఆ ఇద్ద‌రికీ అగ్ర స్థానం ద‌క్క‌లేదు ఎందుక‌నో. విజయ్ దేవరకొండ కు ఒక ర‌కంగా సముచిత స్థానం ద‌క్కింది. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న‌ విజయ్ దేవరకొండ పాపులారిటీ ఇప్ప‌టికే హిందీ బెల్టులో పెరిగింది.

ఇక 2021 ప్ర‌థ‌మార్థం ఆరు నెల‌ల‌ను ప‌రిగ‌ణించి ఈ జాబితాను రూపొందిస్తే క్రాక్ .. వ‌కీల్ సాబ్ లాంటి చిత్రాల‌తో ర‌వితేజ‌.. ప‌వ‌న్ పేర్లు మార్మోగాయి. అందుకే ఆ ఇద్ద‌రికీ జాబితాలో స్థానం ద‌క్కింద‌ని అంచ‌నా వేయొచ్చు. మ‌రోవైపు కొన్ని లోపాల వ‌ల్ల ట్రాకింగ్ వ్య‌వ‌స్థ స‌రైన‌దేనా? అని సందేహాలు వ్య‌క్తం చేసేవాళ్లు లేక‌పోలేదు.

ఓర్మాక్స్ మీడియా భారతదేశం లో ఏకైక ప్రత్యేక మీడియా కన్సల్టింగ్ సంస్థ. ఇది ట్రాకింగ్ వ్య‌వస్థ. ఇది సిస్ట‌మ్ ఆటోమేటెడ్ తో అనుసంధాన‌మై ఉంటుంది. ఇందులో త‌ప్పుల త‌డ‌క‌ల‌కు ఆస్కారం లేద‌ని చెబుతుంటారు. తెలుగు-త‌మిళ-హిందీ ప‌రిశ్ర‌మ‌లు స‌హా హాలీవుడ్ స్టార్ల‌కు సంబంధించిన ట్రాకింగ్ కూడా ఓర్మాక్స్ చేస్తోంది. ఈ సంస్థ ట్రాకింగ్ -టెస్టింగ్- ఫోర్కాస్టింగ్-లీడ్ అనలిటిక్స్ - ఫిల్మ్స్- టివి- ఒటిటి- న్యూస్- మ్యూజిక్ - స్పోర్ట్స్ కోసం కన్సల్టింగ్ లో ముందుంది. ఈ రంగాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సంస్థ‌గా ప్ర‌త్యేక గౌర‌వం పొందుతోంది.