Begin typing your search above and press return to search.

చాచి లెంపకాయ కొట్టిన సల్మాన్ ఖాన్!

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:59 PM GMT
చాచి లెంపకాయ కొట్టిన సల్మాన్ ఖాన్!
X
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ఎన్నో కథలున్నాయి. ప్రేమ కథలు.. ఫైట్లు.. యాక్షన్ స్టంట్లు.. వేట. ఇవన్నీ ఆయన నటించే సినిమాల్లోవి కాదు. అయన నిజ జీవితంలోవే. వీటన్నికితోడు సల్మాన్ ను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్.. ద్వేషించే కొందరు యాంటి ఫ్యాన్స్. అందుకే సల్మాన్ గురించి బాలీవుడ్ లో ఒక పాపులర్ కొటేషన్ ఉంది. " మీరు ఇష్టపడచ్చు.. ఇష్టపడకపోనూవచ్చు... కానీ సల్మాన్ ను మీరు గుర్తించకుండా ఉండలేరు" ఇదే ఆ కొటేషన్.

మరోసారి అలాంటి సందర్భం వచ్చింది. ఈద్ సందర్భంగా సల్మాన్ తాజా చిత్రం 'భారత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కు ముందురోజు అంటే మంగళవారం రాత్రి బాలీవుడ్ లో ఉన్న ఫ్రెండ్స్ కోసం 'భారత్' ప్రీమియర్ షో ను ప్రదర్శించారు. షో పూర్తయిన తర్వాత చాలామంది గుంపు మధ్యలో సల్మాన్ కూడా నడుచుకుని బయటకు వస్తున్నాడు. అయితే ఇంతలో ఏమైందో కానీ సల్మాన్ తన సెక్యూరిటీ గార్డు చెంపను ఛెళ్ళుమనిపించాడు. ఈ విషయం వీడియోలో రికార్డ్ కావడంతో వైరల్ అయింది.

సల్మాన్ ఫ్యాన్ అయిన ఒక చిన్న అబ్బాయిని ఆ సెక్యూరిటీ గార్డు నెట్టడంతో సల్మాన్ కు కోపం వచ్చిందని.. అందుకే అలా చేశాడని చాలామంది అంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్తోంది. కానీ కొందరు నెటిజనులు మాత్రం.. సెక్యూరిటీ గార్డు పై చేయి చేసుకోవడం సల్మాన్ అహంకారానికి నిదర్శనమని.. సెక్యూరిటీ గార్డు తన డ్యూటీ చేస్తున్నందుకు సల్మాన్ చేయి చేసుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. మరి ఏది నిజమో ఆ అల్లాకే తెలియాలి. అయినా ఈ సల్మాన్ కు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోకపోతే నిద్ర పట్టదేమో!