Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' షురూ అవకముందే పాటలు రెడీ చేస్తున్న తమన్...?

By:  Tupaki Desk   |   6 Jun 2020 8:30 AM GMT
సర్కారు వారి పాట షురూ అవకముందే పాటలు రెడీ చేస్తున్న తమన్...?
X
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ఎస్.ఎస్. తమన్ పేరు ముందు ఉంటుంది. టాలీవుడ్ లో ఈయన టాప్ మోస్ట్ కంపోజర్ గా దుమ్ము రేపుతున్నాడు. 'కిక్' సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంధి పలికిన తమన్ అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తమన్ పాటల్లో డప్పుల మోత తప్ప సాహిత్యం వినపడదు అని కామెంట్స్ వినపడేవి. ఇప్పుడు తన పాటలతో వారి చేత కూడా శభాష్ అనిపించుకుంటున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'అలవైకుంఠపురంలో' సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో మేజర్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆల్బమ్ ప్రపంచంలోనే అత్యధికులు విన్న తెలుగు మ్యూజిక్ ఆల్బమ్ గా రికార్డుకెక్కిందంటేనే అర్థం చేసుకోవచ్చు తమన్ తన సంగీతంతో సృష్టించిన సంచలనం. ఇదే ఊపులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'మగువా మగువా' అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో పాటు 'సోలో బ్రతుకే సో బెటర్' 'క్రాక్' చిత్రాలకి సంగీతం అందించాడు తమన్.

కాగా లేటెస్టుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట'కి కూడా థమన్ పాటలు అందించనున్నాడని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. మహేష్ - థమన్ కాంబినేషన్ లో ఇంతకముందు 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలకి థమన్ అద్భుతమైన సంగీతాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా 'సర్కారు వారి పాట'కి థమన్ అదిరిపోయే పాటలు ఇస్తాడని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా మహేష్ బాబు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు చివర్లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో డైరెక్టర్ పరశురామ్ కి కావాల్సినంత టైం దొరకడంతో ఈ సమయంలోనే అన్ని సాంగ్స్ థమన్ నుండి రాబట్టుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఫోన్ కాల్స్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఈ సినిమా ట్యూన్స్ గురించి డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ డిస్కస్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇద్దరూ కూర్చొని ట్యూన్స్ ఫైనలైజ్ చేయబోతున్నారట. ఈ ఏడాది అదిరిపోయే ఆల్బమ్ తో వచ్చిన థమన్ వచ్చే ఏడాది 'సర్కారు వారి పాట'కి అంతకు మించిన పాటలు ఇస్తాడేమో చూడాలి.