Begin typing your search above and press return to search.

‘సైరా’ టీం డైరెక్టర్ మాట వినట్లేదా?

By:  Tupaki Desk   |   1 Dec 2017 11:30 PM GMT
‘సైరా’ టీం డైరెక్టర్ మాట వినట్లేదా?
X
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నుంచి ఛాయాగ్రాహకుడు రవివర్మన్ తప్పుకున్నప్పటికీ చిత్ర బృందం పెద్దగా కంగారు పడినట్లు కనిపించలేదు. వెంటనే రత్నవేలుతో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. రత్నవేలు ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయాడు. సురేందర్ రెడ్డితో కలిసి లొకేషన్ల వేట కూడా మొదలుపెట్టేశాడు. కానీ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తప్పుకోవడం మాత్రం చిత్ర బృందాన్ని బాగానే ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు సరైన రీప్లేస్మెంట్ తీసుకురావడం అంత సులువైన పని లాగా లేదు. సినిమా స్థాయికి తగ్గ ఉన్నత స్థాయి సంగీతం ఇవ్వాలి. దీనికి తోడు ఆ సంగీత దర్శకుడి పేరు చిత్ర ప్రచారానికి ఉపయోగపడాలి. ఈ రెండూ కలగలిసిన మ్యూజిక్ డైరెక్టర్ కోసం వేట సాగుతోంది.

ఐతే ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం తన అభిరుచికి తగ్గ ఔట్ పుట్ తెచ్చుకోవడం గురించే ఆలోచిస్తున్నాడట. అతడి ఆలోచన అయితే తమన్ ను తీసుకుందామనే అట. తమన్ తో సురేందర్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి ‘కిక్’.. ‘రేసుగుర్రం’.. ‘కిక్-2’ లాంటి సినిమాలు చేశారు. ‘సైరా’ మోషన్ పోస్టర్ కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్న సూరి.. అతడికే ప్రాజెక్టు అప్పగించాలనుకుంటున్నాడు. కానీ తమన్ పేరు సినిమాకు అంత ఉపయోగపడదని.. దేశం మొత్తం పరిచయమున్న సంగీత దర్శకుడిని పెట్టుకుంటేనే.. దీనికి దేశమంతా ప్రచారం లభిస్తుందని చిరు.. రామ్ చరణ్ భావిస్తున్నారట. అందుకే బాలీవుడ్ సంగీత దర్శకులతో చర్చలు జరుపుతున్నారట. ఐతే వాళ్లెవరైనా వస్తే మ్యూజిక్ తేడా కొడుతుందని.. సౌత్ నేటివిటీకి తగ్గ మ్యూజిక్ ఇవ్వలేరని.. వాళ్లతో పని చేయించుకోవడం తనకూ ఇబ్బంది అని సురేందర్ ఫీలవుతున్నాడట. మరి చివరికి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి. డిసెంబరు 6నే ‘సైరా’ రెగ్యులర్ షూట్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ లోపే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక ప్రకటన చేస్తారని సమాచారం.