Begin typing your search above and press return to search.

అజార్‌ తో సురేష్‌ బాబుకేంటి లింకు?

By:  Tupaki Desk   |   9 Jan 2016 5:37 AM GMT
అజార్‌ తో సురేష్‌ బాబుకేంటి లింకు?
X
స్టార్ ప్రొడ్యూస‌ర్‌ - స్టార్ బిజినెస్‌ మేన్ - స్టూడియోస్ ఓన‌ర్‌ - థియేట‌ర్ల య‌జ‌మాని - ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ .. ఎలా పిలిచినా ప‌లుకుతారు డి.సురేష్‌ బాబు. మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు త‌న‌యుడుగా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌గా అత‌డికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఐదు ద‌శాబ్ధాల‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అనుభ‌వంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించిన టేస్ట్‌ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ గా సురేష్‌ బాబుకి ఐడెంటిటీ ఉంది.

అయితే ఇన్నేళ్ల‌లో అత‌డు ఎప్పుడూ సినిమాల గురించి ఆలోచించ‌డ‌మే కానీ, ఏనాడూ ముఖానికి రంగేసుకుని న‌టించాలి అని అనుకోలేదు. ఎంద‌రో ద‌ర్శ‌కనిర్మాత‌లు అవ‌కాశాలిచ్చినా వాటిని సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే ఇంత‌కాలానికి ఆ డైలెమ్మాకి తెర‌దించుతూ న‌టించేందుకు రెడీ అవుతున్నారాయ‌న‌. అత‌డు న‌టించేది తెలుగు సినిమా కాదు. బాలీవుడ్ సినిమా. అది కూడా స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ రెమో డి.సౌజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న అజార్ సినిమాలో అత‌డు కీల‌క‌పాత్ర పోషించ‌నున్నారు. క్రికెట‌ర్‌ - హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో ఓ పూర్తి స్థాయి క్యారెక్ట‌ర్‌ లో సురేష్‌ బాబు న‌టిస్తున్నారు.

హీరో రానా సైతం ఓ అతిధిగా త‌ళుక్కుమంటాడ‌ని చెబుతున్నారు. అయితే న‌ట‌న రాదు. కెమెరా ముందు అనుభ‌వం లేక‌పోయినా ద‌ర్శ‌కుడు రెమో.డి.సౌజా తో ఉన్న సాన్నిహిత్యం వ‌ల్ల ఎట్ట‌కేల‌కు సురేష్‌ బాబు అంగీక‌రించార‌ని చెబుతున్నారు. మ‌రో కోణంలో డి.సురేష్‌ బాబు క్రికెట్ ల‌వ‌ర్‌. క్రికెట్ నేప‌థ్యంలో సినిమానే కాబ‌ట్టి అది త‌న‌కి యాప్ట్ అని భావించి ఈ చిత్రంలో న‌టిస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు.