Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాత‌కు 'పంది' పాట్లు!?

By:  Tupaki Desk   |   19 Aug 2018 5:56 AM GMT
అగ్ర నిర్మాత‌కు పంది పాట్లు!?
X
నువ్వు మంచోడివి కాదు కాబ‌ట్టి - వ‌చ్చే జ‌న్మ‌లో `పంది` అయ్యి పుడ‌తావ్‌! అంటూ చిన్న‌ప్పుడు ప‌రాచికాలు ఆడుకునేవాళ్లం. ఇప్పుడు ఆ `పంది` హీరో అయ్యింది. వెండితెర‌పై చిత్ర‌విచిత్ర విన్యాసాల‌తో అల‌రించేందుకు బ‌రిలో దిగుతోంది. దీనికి క‌ర్త క‌ర్మ క్రియ ర‌విబాబు. అల్ల‌రి చిత్రంతో క్రియేటివ్ జీనియ‌స్ అని పేరు తెచ్చుకున్న‌ ర‌విబాబు ఆ త‌ర్వాత ఆశించినంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇవ్వ‌డంలో సత‌మ‌త‌మైన సంగ‌తి తెలిసిందే. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి క‌ట్ట‌ది ఇంకోదారి! అన్న చందంగా ఆయ‌న మార‌డు. చెప్పేది విన‌డు! అన్న‌ట్టే సాగుతోంది వ్య‌వ‌హారం. మొత్తానికి ర‌విబాబు తాను ఎంచుకున్న దారిలోనే వెళుతూ ఎక్స్‌ క్లూజివ్ సినిమాలు చేయాల‌ని త‌పిస్తున్నాడు.

అలా రెండేళ్ల క్రిత‌మే పంది పిల్ల‌పై పూర్తి సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించి అంద‌రికీ పెద్ద షాకిచ్చాడు. `అదుగో` అంటూ పోస్ట‌ర్ల‌లో పంది ఫోటోలు ముద్రించి మ‌రోసారి పెద్ద షాక్ తినిపించాడు. స‌రే ఏదో ప్ర‌యోగం చేస్తున్నాడులే.. ఇదేదో చూసి తీరాల్సిందేన‌ని జ‌నం ఫిక్స‌యిపోయారు. కానీ ఆ ప్రాజెక్టు ఎప్ప‌టికీ పూర్త‌వ్వ‌దే. ఇన్నాళ్లుగా జ‌నం ఆ సినిమా ఎప్పుడొస్తుందా? అంటూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ద‌స‌రాకు `అదుగో` వ‌చ్చేస్తోంది మా కూర్మం అని ప్ర‌క‌టించేశాడు ర‌విబాబు. రెండు మూడేళ్లుగా నిరీక్ష‌ణ ఫ‌లించ‌బోతోంది. అస‌లింత‌కీ పందిపై ఏం చూపిస్తాడో కానీ అంటూ మ‌రోసారి కామ‌న్ ఆడియెన్ స‌హా ఫిలింజ‌నాల్లో ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ ప్ర‌యోగానికి ర‌విబాబును ప్రోత్స‌హించింది ఎవ‌రో తెలుసా? టాలీవుడ్ అగ్ర‌నిర్మాత డి.సురేష్‌ బాబు. క్రియేటివిటీతో పాటు, కొత్త‌ద‌నం ఉంటే ప్రోత్స‌హించ‌డం సురేష్ బాబు శైలి. ఆయ‌న కూడా ద‌ర్శ‌కులకు ఏమాత్రం తీసిపోని క్రియేటివ్ జీనియ‌స్‌. అందుకే పంది వాస‌న ఇట్టే ప‌ట్టేశారు! ర‌విబాబు సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు క్రియేటివ్ జీనియ‌స్‌ లు క‌లిసి చేస్తున్న ఈ ప్ర‌యోగం జ‌నాల్ని ఏమేర‌కు అల‌రిస్తుందోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. ర‌విబాబు ఆ పంది పిల్ల‌ను ప్రేమ‌గా - గోముగా ముద్దాడుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో కుప్ప‌లు తిప్ప‌లుగా ప‌డి ఉన్నాయ్‌. ఇప్పుడు ఇదిగో అగ్ర‌నిర్మాత సురేష్‌ బాబు అంతే ప్రేమ‌గా చంక‌నెత్తుకుని పందిపిల్ల‌తో ఎలా ఆడుకుంటున్నారో..!