Begin typing your search above and press return to search.

రాజకీయాలపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:54 AM GMT
రాజకీయాలపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
X
సినిమా వాళ్లు సమకాలీన రాజకీయాల గురించి ఓపెన్ గా మాట్లాడటం అరుదు. రాజకీయాలు పెద్దగా తెలియవనో.. ఆసక్తి లేదనో మాట దాటవేసేస్తుంటారు. ఐతే సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. తాజాగా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి వెళ్తున్న జంపింగ్ జిలానీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ పొలిటికల్ డ్రామానే అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సమకాలీన రాజకీయాలపై చాలానే సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సురేష్ బాబు.. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి.. వేరే చోట ఏదో ఆశ చూపిస్తే.. గెలిపించిన పార్టీ కండువా ప‌క్క‌న పెట్టేసి వెళ్లిపోతున్నారని.. ఇది సరి కాదని.. జ‌నానికి ఏ పార్టీ గుర్తు చూపించి ఓట్లు వేయించుకున్నారో.. ఆ పార్టీకే ప‌ని చేయాలని.. అధికారం వైపు వెళ్లిపోవడం అంటే నమ్మ ఓటేసిన వాళ్లను అగౌరవపరచడమే అని.. ఎన్నిక‌ల ద్వారా వ‌చ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని అన్నారు సురేష్ బాబు.

తన తండ్రి రామానాయుడు రాజ‌కీయాల్లో చేరిన‌ప్పుడు రాజ‌కీయ వ్య‌వ‌స్థ ఇలా ఉంటుందన్న‌ది తనకు తెలియదని.. డబ్బులిచ్చి ఓట్లు కొంటార‌న్న విష‌యం తెలిసి షాకయ్యానని చెప్పారు సురేష్ బాబు. తన తండ్రి ఎంపీ అయ్యాక తాను ఒక్కసారి కూుడా ఢిల్లీకి వెళ్లలేదని.. అక్కడికి వెళ్తే అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడతానేమో అని ఆగిపోయానని.. నాన్న‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌నే ఆలోచించా తప్ప ఇంజ‌నీరింగ్ కాలేజీలు వ‌స్తున్నాయి.. మ‌నం కూడా ఒక‌టి పెట్టేద్దాం లాంటి ఆలోచనలేమీ చేయలేదని సురేష్ బాబు చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని.. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉందని అన్నారు.

తనకు ఎన్టీఆర్.. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డే నచ్చిన ముఖ్యమంత్రులని సురేష్ తెలిపారు. వీళ్లిద్దరూ నిజ‌మైన నాయ‌కులని.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారని.. వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో వీరిని మించిన వారు లేరని.. ఇక్కడే వారి నాయకత్వ లక్షణాలు కనిపించేవని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో జరుగుతున్న కొన్ని త‌ప్పుల్ని కూడా స‌మ‌ర్థిస్తూ వ‌స్తున్నామన్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో పాత్ర‌లు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాయని.. ఆ పాత్ర‌ల్లో ఇవాల్టి రాజ‌కీయ నేత‌లంద‌రినీ చూస్తామని.. అంతే తప్ప ఏ ఒక్కరినో ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని సురేష్ బాబు అన్నారు. ఫలానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ ఈ సినిమా లేదని చెప్పారు.