Begin typing your search above and press return to search.

రాణా న‌న్ను డామినేట్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 Aug 2017 5:30 PM GMT
రాణా న‌న్ను డామినేట్ చేస్తున్నాడు
X
టాలీవుడ్ లోని దిగ్గ‌జ నిర్మాణ సంస్థ‌ల్లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ ఒక‌టి. మూవీ మొఘ‌ల్ డా.డి. రామానాయుడు త‌న‌యుడు డి.సురేష్ బాబు ఈ సంస్థ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వ‌చ్చాయి. ఈ బ్యాన‌ర్ ద్వారానే ఎంతోమంది హీరోలు - దర్శకులు - ఆర్టిస్టులు టాలీవుడ్ కు పరిచయమ‌య్యారు. అయితే, సురేష్ బాబు త‌న‌యుడు రాణా త‌మ సొంత బ్యాన‌ర్ లో హీరోగా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. రాణా తొలి సినిమా లీడ‌ర్ కూడా ఏవీఎం బ్యాన‌ర్ పై వ‌చ్చింది. ఆగ‌స్టు 11న విడుద‌ల కానున్న నేనే రాజు నేనే మంత్రితో ఆ కోరిక తీరింది. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా సురేష్ బాబు ఈ విష‌యం పై వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూ విష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే....

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఖైదీ త‌ర‌హా మాస్ - యాక్షన్ కథతో రాణాను టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేయాల‌నుకున్నా. ఆ త‌ర‌హా కథ కోసం చాలా రోజులు వెతికినా దొర‌క‌లేదు. స‌రిగ్గా అదే స‌మ‌యానికి శేఖర్‌ కమ్ముల లీడర్ సినిమా క‌థ‌ను వినిపించారు. ఆ సినిమాను వెంక‌టేష్ తో చేయ‌మ‌ని శేఖ‌ర్ కు చెప్పిన‌, రాణాతోనే చేద్దామ‌న‌డంతో ఒకే చెప్పాను. అలా రాణా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. హీరో పాత్ర‌లు చేస్తున్న స‌మ‌యంలో రాణాతో బాహుబ‌లిలో విల‌న్ పాత్ర చేయించాల‌ని నేను అనుకున్నాను. బాలీవుడ్‌ లో శతృఘ్నసిన్హా - వినోద్‌ ఖన్నా వంటి స్టార్ హీరోలు కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో మెప్పించారు. ఆ తర్వాత స్టార్ హీరోలుగా వెలిగారు. అదే త‌ర‌హాలో రాణా కూడా రాణిస్తాడ‌ని నేను భావించాన‌ని సురేష్ బాబు చెప్పారు.

మా సొంత బ్యాన‌ర్ లో రాణాతో సినిమా చేయ‌లేద‌న్న వెలితి న‌న్ను వెంటాడుతోంది. సూపర్‌ హీరో - విలన్ తరహా కథతో రాణాతో సినిమా చేయ‌డానికి చాలా కాలం వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. మా బ్యాన‌ర్ లో రాణాతో సినిమా చేయాల‌నుకుంటున్న సమయంలో తేజ వినిపించిన కథ నన్ను ఆకట్టుకుంది. మంచి సినిమాను తెరకెక్కిస్తాడనే నమ్మకంతోనే తేజతో సినిమా చేశాం. తన స్ట‌యిల్ కు భిన్నంగా తేజ చేసిన ఓ డిఫరెంట్ సినిమా. ఈ చిత్రంలోని ఎమోషన్ సీన్లలో రాణా నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. తను ప్రాణంగా ప్రేమించిన రాధ (కాజల్) కోసం జోగేంద్ర ఏ దారిని ఎంచుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో నేను కన్న కలలన్నీ సాకారమయ్యాయి. ఫలితం ఏదైనా మంచి సినిమా చేశామనే సంతృప్తిని మిగిల్చిందద‌ని సురేష్ బాబు అన్నారు.

నేను మా నాన్నను డామినేట్ చేసినట్లుగానే ఇప్పుడు రాణా నన్ను డామినేట్ చేస్తున్నాడు. రామానాయుడిగారి లాగానే రాణాకు సినిమా పట్ల తపన ఎక్కువ. నేను ఇప్పటికీ భయపడుతూనే సినిమాలు రూపొందిస్తుంటాను. చాలా సార్లు నా భార్యతో ఈ సినిమా ఆడకపోతే ఊరెళ్లిపోదాం అని చెబుతుంటాను. అలా చాలా సార్లు ఊరికి వెళ్లొచ్చాను అని సురేష్ బాబు చమత్కరించారు. మొత్తానికి తండ్రి క‌ల‌ను రాణా నెర‌వేర్చాడో లేదో ఆగ‌స్టు 11న సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.