Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స‌మ్మెకు అస‌లు కార‌ణాలివే: సురేష్ బాబు

By:  Tupaki Desk   |   15 Dec 2017 11:59 AM GMT
టాలీవుడ్ స‌మ్మెకు అస‌లు కార‌ణాలివే: సురేష్ బాబు
X
పెళ్లి చూపులు వంటి చిన్న సినిమాలోని క‌థాబ‌లాన్ని న‌మ్మి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసింది. సురేష్ బాబు న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ఆ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. అదే త‌ర‌హాలో తాజాగా విడుద‌లైన మెంట‌ల్ మ‌దిలో చిత్రానికి సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఆ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో, చిత్ర యూనిట్ స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సురేష్ బాబు స‌క్సెస్ మీట్ ల పై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌గానే షాక్ అయ్యాన‌ని - స‌డెన్ గా స‌క్సెస్ మీట్ ఎందుకు పెడుతున్నార‌ని అడిగాన‌ని సురేష్ బాబు చెప్పారు. 4వ‌ వారంలో కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌న సినిమాను 15-20 థియేట‌ర్ల‌లో విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శిస్తున్నామ‌ని, ఒక చిన్న సినిమాకు ఇది స‌క్సెస్ కింద లెక్కేన‌ని ఆ చిత్ర నిర్మాత‌లు చెప్పార‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో సక్సెస్ మీట్ లపై ఒక ట్రెండ్ న‌డుస్తోంద‌ని - సినిమా విడుద‌లైన మొద‌టి రోజు - మూడోరోజు - ఎనిమిదో రోజు స‌క్సెస్ మీట్ లు ఏర్పాటు చేస్తున్నార‌ని సురేష్ బాబు అన్నారు. అస‌లు స‌క్సెస్ అంటే ఏమిటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన వివేక్ ఆత్రేయ గారికి నిర్మాత రాజ్ కందుకూరి మ‌రో సినిమా చేసే అవ‌కాశాన్నిచ్చార‌ని, ఆ సినిమాకు కూడా తాను స‌మ‌ర్ప‌కుడిగా - డిస్ట్రిబ్యూట‌ర్ గా ఉంటాన‌ని, అది స‌క్సెస్ అని అన్నారు. ఈ సినిమాలో హీరో - హీరోయిన్లు - న‌టీన‌టులు - ద‌ర్శ‌కుడు - అంద‌రూ బాగా ప‌ర్ ఫార్మ్ చేశార‌ని, ఈ చిత్రానికి మంచి రివ్యూలు కూడా వ‌చ్చాయ‌ని చెప్పారు. అయితే, ఈ సినిమా తాము ఆశించినంత స్థాయిలో విజ‌యం సాధించిందా? అని విశ్లేషించుకోవాల‌ని అన్నారు. ఒక సినిమాలో ద‌ర్శ‌కుడు - నిర్మాత‌ - డిస్ట్రిబ్యూట‌ర్లు - ఫిల్మ్ స్కాల‌ర్స్ - మీడియా - ప్రేక్ష‌కులు... ఇలా అంద‌రూ భాగ‌స్వాములేన్నారు. సినిమా చూశాక ప్రేక్ష‌కులు తీర్పు చెబుతార‌ని, ఫిల్మ్ స్కాల‌ర్స్ - మీడియా త‌మ‌కు ఆ సినిమాలోని లోపాల గురించి తెలియ‌జేయాల‌ని కోరారు. ఒక సంగీత ద‌ర్శ‌కుడి పాట ప్ర‌తి రోజు రేడియో వినిపిస్తే అది సక్సెస్ అని - ఇండ‌స్ట్రీలో కొంత‌మంది వాస్త‌వాల‌ను దాచిపెట్టేస్తుంటార‌ని - కానీ, వాటిని అంగీక‌రించిన‌పుడే మ‌రిన్ని మంచి చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌ల‌మ‌ని అన్నారు. ఈ చిత్రం ఇంకా బాగా ఆడాల్సింద‌ని సురేష్ బాబు న‌ర్మ‌గ‌ర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ సినిమాలో చాలా మంచి అంశాలున్నాయ‌ని - త‌న‌కు న‌చ్చింది కాబ‌ట్టే మ‌ద్ద‌తిచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాన‌న్నారు. ఈ సినిమాకు మెంట‌ల్ మ‌దిలో అనే టైటిల్ క‌రెక్టుగా సూట్ అవుతుందని, కానీ ప్రేక్ష‌కులకు ఆ టైటిల్ రీచ్ అయిందా? లేదా అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు. ఇది మంచి టైటిలా - కాదా అన్న ప్ర‌శ్న‌కు అవును - కాదు అని ఒక్క ముక్క‌లో ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేర‌న్నారు. చాలా మంచి చిన్న సినిమాలకు 3.5 రేటింగులు వ‌చ్చినా ప్రేక్ష‌కులు థియేటర్ల‌కు ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించుకోవాల‌న్నారు. వాళ్లంద‌రికీ చిన్న సినిమా విడుద‌లైన‌ 3 - 4 వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ ల‌లో సుల‌భంగా చూసే అవ‌కాశం ఉండ‌డం వ‌ల్లే అలా జ‌రుగుతోంద‌న్నారు. ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం ఉన్న ప్ర‌తి ఫోన్ లో సినిమా చేసేయొచ్చ‌ని - అటువంటపుడు థియేట‌ర్ కు రావాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని వారు భావిస్తారన్నారు. ఇది చాలా సీరియ‌స్ అంశ‌మ‌ని - నా సినిమా శాటిలైట్ రైట్స్ - డిజిట‌ల్ రైట్స్ ను ఇంత‌కు అమ్మేశాను....నేను పెట్టిన డ‌బ్బులు సేఫ్ గా వ‌చ్చేశాయి....అని ఆలోచించే ధోర‌ణి మారాల‌న్నారు. గ‌తంలో - సంవ‌త్సరం త‌ర్వాత శాటిలైట్ లో వ‌చ్చే సినిమాల‌ను ఆరు నెల‌ల‌కు - 3 నెల‌ల‌కు తీసుకు వ‌చ్చామ‌ని - ఇపుడు 4 వారాల‌కే ఇచ్చేస్తున్నామ‌ని - భ‌విష్య‌త్తులో థియేట‌ర్ల‌తో పాటు శాటిలైట్ లో కూడా సినిమాలు విడుద‌ల చేసేసుకుంటార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అపుడు ప్రేక్ష‌కుడికి థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమా చూడాల‌ని పించ‌ద‌ని అన్నారు. ఇండ‌స్ట్రీ - ట్రేడ్ వ‌ర్గాలు - నిర్మాత‌లు - డిస్ట్రిబ్యూట‌ర్లు - ఎగ్జిబిట‌ర్లు అంతా కూర్చొని దీనికి ఓ ప‌రిష్కారం క‌నుగొనాలి కోరారు. మీడియా కూడా ఇండ‌స్ట్రీపై స‌హేతుకుమైన ప్ర‌శ్న‌లు సంధించాల‌ని, అమ‌లు చేయ‌డానికి వీలున్న స‌ల‌హాల‌ను ఇవ్వాల‌ని కోరారు.

సాధార‌ణంగా ప్ర‌తి థియేట‌ర్లో రాబోయే సినిమా ట్రైల‌ర్లు ప్ర‌ద‌ర్శించాల‌ని - కానీ క్యూబ్ -యూఎఫ్ వోలు వ‌చ్చిన త‌ర్వాత వారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి ప్రేక్ష‌కుల‌ను విసిగిస్తున్నార‌న్నారు. థియేట‌ర్ల‌లో వేసే ట్రైల‌ర్ ప్ర‌భావం ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ‌గా ఉంటుందని, వారు క‌చ్చితంగా ట్రైల‌ర్లు ప్ర‌ద‌ర్శించేలా నిర్మాత‌లు ఒత్తిడి తీసుకు రావాల‌ని అన్నారు. టీవీలు - సోషల్ మీడియా - యూట్యూబ్ ల‌లో డ‌బ్బులు చెల్లించడానికి మొగ్గు చూపుతున్నార‌ని, థియేట‌ర్ల‌లో ప‌ద్ధ‌తి ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. మ‌ల్లీ ప్లెక్స్ ల‌లో ఒక సినిమాపై వ‌చ్చిన ఆదాయంలో విడుద‌లైన మొద‌టి వారం 50 శాతం - రెండో వారం 40 శాతం - మూడోవారం 30 శాతం వాటా ఇస్తున్నార‌ని చెప్పారు. కానీ, సింగిల్ స్క్రీన్ ఉన్న థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు ఒక ఇబ్బంది ఉంద‌న్నారు. చిన్న సినిమాలు వారు ఆ థియేట‌ర్ల‌లో కూడా మ‌ల్టిప్లెక్స్ ల త‌ర‌హాలో షేర్ కావాల‌ని కోరుతార‌ని - పెద్ద సినిమా ప్రొడ్యూస‌ర్లు ఆ థియేట‌ర్ల‌ను లీజ్ కు తీసుకొని స్వ‌యంగా ఆడిస్తార‌ని అన్నారు.వీరిద్ద‌రి మ‌ధ్య‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ య‌జ‌మానులు న‌లిగిపోతున్నార‌ని - అందుకే అన్ని సినిమాల‌కు ఏదో ఒక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌మ‌ని వారు కోరుతున్నార‌ని అన్నారు. పెద్ద సినిమాలు 50 కోట్లు గ్రాస్ వ‌సూలు చేస్తే - 40 కోట్లు షేర్ వ‌సూలు చేసిన‌ట్ల‌ని - అందులో 35 కోట్లు నిర్మాత‌లు - డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు పోతుంద‌న్నారు. థియేట‌ర్ల వారికి మిగిలిన 5 కోట్ల‌లో కోటి రూపాయ‌లు ట్యాక్స్ పోగా 3-4 కోట్లు మాత్ర‌మే మిగులుతాయ‌న్నారు. మ‌ల్టి ప్లెక్స్ ల వారు ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నార‌ని - సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల వారి గురించి పోరాడాల‌ని - వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని క‌నుగొనాల‌ని కోరారు.

వ‌చ్చే ఏడాది మార్చి నుంచి జ‌ర‌ప త‌ల‌పెట్టిన టాలీవుడ్ స‌మ్మెపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు సురేష్ బాబు స‌మాధాన‌మిచ్చారు. ప్రొజెక్ట‌ర్ - స్క్రీన్ ల స్థానంలో డిజిట‌ల్ ప్రింట్ - స్క్రీన్ల నిర్మాణం కోసం థియేట‌ర్ల య‌జ‌మానులు......నిర్మాత‌ల నుంచి వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీ(వీపీఎఫ్)ని మొద‌టి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వ‌సూలు చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ ప‌ద్ధ‌తి అమెరికాతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ‌లులో ఉందని, అయితే, 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ఇండియాలో థియేట‌ర్ల య‌జ‌మానులు వీపీఎఫ్ వ‌సూలు చేస్తున్నార‌ని, ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. వాస్త‌వానికి థియేట‌ర్ల య‌జ‌మానులు సొంతంగా డిజిట‌ల్ ప్రొజెక్ట‌ర్ - స్క్రీన్ లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. కానీ, వారంద‌రూ, థియేట‌ర్ల‌లో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు క్యూబ్ - యూఎఫ్ వో వంటి థ‌ర్డ్ పార్టీ డిజిటల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లపై ఆధార‌ప‌డి వాటికి డ‌బ్బులు చెల్లిస్తున్నార‌న్నారు. అందుకోసం నిర్మాత‌లు వీపీఎఫ్ చెల్లించాల‌ని థియేట‌ర్ల య‌జ‌మానులు కోరుతున్నార‌ని చెప్పారు. మంచి సౌండ్ సిస్ట‌మ్ - టాయిలెట్లు - సీట్లు - స్క్రీన్ - ప్రొజెక్ష‌న్ - త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం థియేట‌ర్ల య‌జ‌మానుల బాధ్య‌త అని అన్నారు. అటువంటిది, థియేట‌ర్ య‌జ‌మానులు......డిజిట‌ల్ ప్రొజ‌క్ష‌న్ అనే ఒక పార్ట్ ను తీసేసి...క్యూబ్ - వీఎఫ్ ఎక్స్ వంటి థ‌ర్డ్ పార్టీల‌కు రెంట్ కు ఇచ్చార‌ని, వారు నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి భారీగా వీపీఎఫ్ వ‌సూలు చేస్తాన‌డం స‌రికాద‌న్నారు. ఇదే త‌ర‌హాలో భ‌విష్య‌త్తులో సౌండ్ సిస్ట‌మ్ ను ఒక‌డు - టాయిలెట్ల‌ను ఒక‌డు లీజ్ కు తీసుకుంటాడ‌ని అన్నారు. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ....థియేట‌ర్ ఓన‌ర్ల ద‌గ్గ‌ర సంత‌కాలు పెట్టించుకొని ముంద‌స్తు ఒప్పందాలు చేసుకొని, బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌కుండా చేస్తున్నార‌న్నారు. ఒక వారం సినిమాల షూటింగ్ - విడుద‌ల ఆపేస్తే ఏమైపోతామో అన్న భ‌యం కొంద‌రిలో ఉంద‌ని చెప్పారు. త‌మ సినీ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్యే పూర్తి స‌ఖ్య‌త లేద‌ని, దానిని వారు అనుకూలంగా మ‌లుచుకున్నార‌ని చెప్పారు. ఈ విష‌యంలోనే డిజిటల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు - టాలీవుడ్ కు మ‌ధ్య వివాదం న‌డుస్తోంద‌ని, వారిపై తాము పోరాడుతున్నామ‌ని అన్నారు. వారిపై పోరాటం ఆగ‌ద‌ని, ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై పెద్ద గొడ‌వ అవుతుంద‌ని అన్నారు. టాలీవుడ్ నిర్మాత‌లు - థియేట‌ర్ల య‌జ‌మానులు ప‌డుతున్న ఇబ్బందుల గురించి సురేష్ బాబు నిష్క‌ల్మ‌షంగా - నిజాయితీగా - నిర్మొహ‌మాటంగా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడిన వైనం ప‌లువురిని ఆకట్టుకుంది.