Begin typing your search above and press return to search.

పైరసీపై యుద్ధానికి కేటీఆర్ సై

By:  Tupaki Desk   |   28 Oct 2015 9:58 AM GMT
పైరసీపై యుద్ధానికి కేటీఆర్ సై
X
పైరసీ.. టాలీవుడ్ ను మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీలనూ పీల్చి పిప్పి చేస్తున్న భూతం. దీని వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం కష్టం. ఏటా వందలు, వేల కోట్లకు నష్టం పెరిగిపోతోంది. పైరసీ మాఫియా దెబ్బకు చాలా సినిమాలు దారుణమైన నష్టాల పాలవుతున్నాయి. ఇంతకుముందు కేవలం సీడీల ద్వారా వ్యాపారం సాగేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పైరసీ వ్యాపారం జడలు విప్పడంతో దాన్ని అడ్డుకోవడం చాలా కష్టమవుతోంది. సినిమా విడుదలైన తొలి రోజు రాత్రికే ఇంటర్నెట్ లో పైరసీ వెర్షన్ దర్శనమిస్తోంది. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి ఇండస్ట్రీ జనాలు చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. అవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు. తమ సినిమా విడుదలైనపుడు ఎవరికి వారు ప్రయత్నాలు చేయడమే తప్ప.. ఉమ్మడిగా కదిలింది లేదు.

ఐతే ఇలా ఊరుకుంటే లాభం లేదని భావించి.. ప్రభుత్వ సహకారంతో పైరసీకి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించారు సినీ పెద్దలు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ఓ బృందం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిసింది. వారితో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల టాలీవుడ్‌కు గత పది నెలల్లో రూ.350 కోట్ల నష్టం వాటిల్లిందని సురేష్ బాబు కేటీఆర్ కు వివరించారు. ఇంటర్నెట్లో పైరసీ ప్రింట్లు పెడుతున్న 240 వెబ్ సైట్ల వివరాలను సురేష్ బాబు ప్రభుత్వానికి అందజేశారు. పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి.. నెలలోగా వెబ్‌సైట్లపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సురేష్ బాబు తెలిపారు.